
అక్రమ తవ్వకాల అడ్డగింత
ఓర్వకల్లు: మండలంలోని ఉప్పలపాడు రెవెన్యూ పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుమారు 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. సదరు భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములు అధికార పార్టీ నాయకులకు ఆర్థిక వనరులుగా మారాయి. ఈ క్రమంలో సర్వే నంబర్ 437లో గల బీడు భూముల్లో కొద్ది రోజుల క్రితం స్థానిక కర్రెమ్మ గుడి వద్ద నుంచి ఏపీఐఐసీ భూముల్లోకి యంత్రాల సాయంతో దారి ఏర్పాటు చేసుకొని టీడీపీ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ మట్టిని గుట్టపాడు వద్ద గల స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం చేపట్టిన పైపులైన్ నిర్మాణ పనుల కొరకు తరలిస్తున్నటు్‌ల్ స్థానికులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఇటాచీలు, జేసీబీలు, టిప్పర్లతో మట్టిని తరలిస్తుండటంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు మధు మరికొంత మంది స్థానికులు అక్కడికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులకు టీడీపీ నాయకుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో పశువులు మేత మేసేందుకు కూడా అనుమతించని భూముల్లో ఏపీఐఐసీ అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతి ఎలా ఇస్తారని నిలదీశారు? విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ విద్యాసాగర్‌ను వివరణ కోరగా.. ఆ భూములు ఏపీఐఐసీకి సంబంధించినవి కావడంతో ఏపీఐఐసీ వారు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ వారికి ఏ మాత్రం సంబంధం లేని విషయమని పేర్కొన్నారు.
అధికార పార్టీ అండతో
చెలరేగిపోతున్న మట్టి మాఫియా
ఉప్పలపాడు నుంచి స్టీల్ ప్లాంట్
పైపులైన్ నిర్మాణ పనులకు
మట్టి తరలింపు
చోద్యం చూస్తున్న ఏపీఐఐసీ
అధికారులు

అక్రమ తవ్వకాల అడ్డగింత