
విద్యుదాఘాతంతో నెమలి మృతి
ఉయ్యాలవాడ: మండలంలోని పెద్దయమ్మనూరు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో మంగళవారం జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు కానాల శ్రీనివాసరెడ్డి పొలంలోని విద్యుత్ స్తంభంపై విగతజీవిగా ఉన్న నెమలిని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే నెమలికి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఈతకు వెళ్లి బాలుడి మృతి
పెద్దకడబూరు: ఎల్‌ఎల్‌సీలో ఈతకు వెళ్లి మంగళవారం బాలుడు మృత్యువాతపడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన హనుమంతు, నాగలక్ష్మి చిన్నకుమారుడు హనమేష్(8) పుట్టుకతో మూగ, చెవిటి. స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నం బడి వదిలిన తరువాత తోటి పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీకి వెళ్లాడు. ఈత రాకపోవడంతో ఒడ్డున కూర్చున్నాడు. కొంతసేపు తరువాత తోటివారితో కలిసి నీటిలో దిగాడు. కొంచెం లోపలికి పోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన తోటి పిల్లలు పెద్దగా అరవడంతో అక్కడ ఉన్నవారు కాలువలో దిగి వెతికినా లాభం లేకపోయింది. దాదాపు 500 మీటర్ల దూరంలో పిల్లవాడి ఆచూకీ లభించినా అప్పటికే విగతజీవిగా మారాడు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
మూడిళ్లలో చోరీ
ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్‌జీవోస్ కాలనీలో రెండిళ్లతోపాటు తిరుమలనగర్‌లో మరో ఇంటిలో పట్టపగలే చోరీ జరిగింది. ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన మహాబలేశ్వరప్ప, సుజాత దంపతులిద్దరూ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం రీత్యా ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. వారి ఇంటి తాళాలను దొంగలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.60 వేల నగదు, ఏడు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ను అపహరించారు. పక్క ఇంట్లో నివాసం ఉండే వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న గోపాల్, నాగవేణి దంపతులు పనినిమిత్తం ఊరికి వెళ్లగా వారి ఇంటి తాళాలు పగలగొట్టి స్టీల్ డబ్బాలో దాచిపెట్టిన రూ.లక్ష నగదు, ఐదు గ్రాముల బంగారు ఉంగరాన్ని చోరీ చేశారు. తిరుమలనగర్‌లో నివాసం ఉండే కాత్రికి హరిశ్చంద్రారెడ్డి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లొచ్చేలోగా 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.60 లక్షల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో నెమలి మృతి

విద్యుదాఘాతంతో నెమలి మృతి