
పిడుగుల కాలం... అప్రమత్తంగా ఉందాం..!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపుల వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదాలున్నాయి. ఇటీవల ఒక్కరోజులోనే జిల్లాలో మూడు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. వేసవిలో కురిసే అకాల వర్షాల సమయంలో పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిడుగు పాటు వంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ వివరించారు.
● ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వారు, పశువుల కాపర్లు, గొర్రెల పెంపకందారులు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలి. లేదా రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని మోకాళ్ల కూర్చోవాలి.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నపుడు మీ మెడ వెనుక జుట్టు నిక్క బొడిచినా, చర్మం జలదరింపునకు గురైనా మెరుపు పిడుగు రావడానికి సూచనగా భావించాలి.
● ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయాలి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తర్వాత కూడా 30 నిముషాల వరకు ఇంట్లోనే ఉండాలి.
● కారు, ఇతర వాహనాల్లో ఉంటే అన్ని డోర్లు మూసివేయాలి.
● పిడుగుపాటకు గురైన బాధితుడిని సత్వరమే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
● ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు చెట్ల కింద, చెట్ల సమీపంలో, టవర్లు, చెరువుల వద్ద ఉండకూడదు.
● బహిరంగ ప్రదేశాల్లో ఉన్న షెడ్లు, ఇంటిపై ఇతర చిన్న నిర్మాణాలలో ఉండకూడదు.
● ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు, చార్జ్‌డ్ ఫోన్లు/మొబైల్స్ వినియోగించరాదు.
● పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులను కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు.
● మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి.
విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ సూచనలు