
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. బీటెక్ పూర్తి చేసివారి కంటే ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్‌లోనూ పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30న రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3 ప్రభుత్వ, 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాల, బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు నంద్యాల ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్, బనగానపల్లె వాసవీ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సీఎంఈ, బీఎం , సీహెచ్‌ఎస్‌టీ, సీసీపీ, డిప్లమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్ 3 ఏళ్ల డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగావకాశాలున్నాయి. అలాగే వీరు బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, సివిల్ ఎన్విరాన్‌మెంట్ కోర్సులు చేయొచ్చు.
30న ప్రవేశ పరీక్ష
పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30న నంద్యాల జిల్లా కేంద్రంలో పాలిసెట్ నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపీఓఎల్‌వైసీఈటీ.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఉచిత శిక్షణ ప్రారంభించారు. మెటీరియల్ కూడా అందించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది.
ప్రవేశం ఇలా..
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్హతతో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పాలిటెక్నిక్‌లో చేరొచ్చు. ఇంటర్ ఒకేషనల్ చేసిన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఐటీఐ ట్రేడ్లలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్రిడ్జి కోర్సు ద్వారా నిర్వహించే అర్హత పరీక్షకు హాజరవ్వాల్సి ఉంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇదివరకే పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రవేశం నాటికి పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
చక్కటి ఉపాధి
డిప్లమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. వివిధ సంస్థలు డిప్లమా పూర్తి చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. జీవితంలో త్వరగా స్థిరపడడానికి పాలిటెక్నిక్ సరైన మార్గం. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇదో మంచి అవకాశం, డిప్లమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. – శ్రీనివాసప్రసాద్,
నంద్యాల పాలిసెట్ కన్వీనర్, నంద్యాల
15 వరకు పాలిసెట్ దరఖాస్తుకు
గడువు
పదో తరగతి విద్యార్థులకు అవకాశం
ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో
ద్వితీయ ఏడాదిలో నేరుగా ప్రవేశం
30న ప్రవేశ పరీక్ష

ఉజ్వల భవితకు పాలిటెక్నిక్