
వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
కర్నూలు(సెంట్రల్) : వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వక్ఫ్ బోర్డు జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోదీ రాజ్యంలో లౌకిక వాదానికి తూట్లు పొడుస్తున్నారని, అందులో భాగంగా వక్ఫ్ భూముల ఆక్రమణకు పూనుకుంటున్నారని చెప్పా రు. శనివారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ–ఇన్సాఫ్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయరాదని కోరుతూ ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జాకీర్ ఆహ్మద్ మాట్లాడుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోని ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు,అణగారిన వర్గాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్, ప్రైవేట్‌పరం చేసేందుకే సవరణలు చేశారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ముంచే ప్రయత్నం జరుగుతోందని , దీనిని కాపాడాలంటే బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.జగన్నాథం మాట్లాడుతూ..విభిన్న మతాల కలయికకు ప్రతీకగా నిలిచే భారతదేశంలో మతోన్మాద రాజకీయాల కుట్ర జరుగుతోందన్నారు. అందులో భాగంగా అంబేడ్కర్ ఆశయ సాధనకు తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణకు పూనుకుందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నాయకులు మహేష్, కుమార్, ఈశ్వర్, నాగరాజు, ఇన్సాఫ్ నాయకులు అన్వర్‌బాషా పాల్గొన్నారు.
వక్ఫ్ బోర్డు జేఏసీ కన్వీనర్ సయ్యద్
జాకీర్ అహ్మద్