
ఏపీఎస్పీ రెండో పటాలంలో ప్రక్షాళన
కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో ప్రక్షాళన దిశగా బదిలీలకు నూతన కమాండెంట్ దీపిక పాటిల్ శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై బదిలీ వేటు వేశారు. ప్రత్యేక పోలీసు విభాగం చీఫ్ కార్యాలయ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీల్లో భాగంగా వివిధ హోదాల్లోని 112 మంది సిబ్బందికి స్థానచలనం కల్పిస్తూ శుక్రవారం రాత్రి కమాండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 13 మంది ఏఆర్‌ఎస్‌ఐలు, 28 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 71 మంది పోలీసు సిబ్బందిని వారున్న చోటు నుంచి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరిపోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల రోజుల పాటు బదిలీల జాబితాపై ఆయా కంపెనీల ఆర్‌ఐలు కసరత్తు చేసి జాబితాను రూపొందించగా, దాని ఆధారంగా జూమ్ మీటింగ్ నిర్వహించి బయటి కంపెనీల్లో పనిచేస్తున్న వారితో కూడా కమాండెంట్ మాట్లాడి బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
టర్న్ ప్రకారం హెడ్ క్వార్టర్‌కు నియామకం
బదిలీల వ్యవహారంలో గతంలో ధన ప్రవాహం కీలకంగా పనిచేసేది. పటాలంలో పనిచేసే సిబ్బందికి టర్న్ ప్రకారం హెడ్ క్వాటర్ విధులకు అవకాశం కల్పించాలి. పటాలంలో హెడ్ క్వార్టర్‌తో కలిపి మొత్తం 9 కంపెనీలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా బయటి కంపెనీల్లో పనిచేసినవారికి ఈ బదిలీల్లో హెడ్ క్వార్టర్ విధులు నిర్వహించే అవకాశం దక్కిందని సిబ్బంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత
ప్రతి ఒక్కరినీ ఏడాదికొకసారి ఉన్న కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేయాలనే నిబంధన ఉంది. ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసినవారికి ఈ బదిలీల్లో న్యాయం జరిగిందని సిబ్బందిలో చర్చ జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాలు సాకుగా చూపి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగాలని ఎక్కువమంది సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి వైద్యుల చేత కమాండెంట్ వారికి వైద్యపరీక్షలు జరిపించారు. అనారోగ్య కారణాలతో వాస్తవంగా బాధ పడుతున్నట్లు డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా అలాంటి వారికి ప్రాధాన్యతనిచ్చి హెడ్ క్వార్టర్‌లో కొనసాగేలా చర్యలు చేపట్టారు. అలాగే పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని కూడా కోరుకున్న స్థానాల్లో నియమించారు.
13 మంది ఏఆర్‌ఎస్‌ఐలు, 28 మంది హెచ్‌సీలు, 71 మంది పీసీలు బదిలీ
హెడ్ క్వార్టర్‌లో పాతుకుపోయిన
ఫెవికాల్ వీరులందరికీ స్థానచలనం
ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత
నెల రోజుల పాటు కసరత్తు చేసి
బదిలీల జాబితా విడుదల