
తండ్రీకొడుకులు నోరు పారేసుకుంటున్నారు. సొంత పార్టీ లేదు
మంత్రి టీజీపై
తమ్ముళ్ల తిరుగుబాటు
● పీఏల తీరుపై పెల్లుబికిన ఆగ్రహం
● మంత్రి వైఖరిని తూర్పారబట్టిన శ్రేణులు
● అసహనంతో మైక్ విసిరికొట్టి
వెళ్లిపోయిన భరత్
● తాజాగా టీజీ ఇంట్లో
బీజేపీ సీనియర్ నేతకు అవమానం
● కర్నూలు కూటమిలో ముసలం
పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యే కాదు.. కులానికి
‘‘నేను ఎమ్మెల్యేను కాదు, మంత్రిని.
మీ సమస్యలను పరిష్కరించేందుకు
ఐదుగురు పీఏలను నియమించాం.
వారి దృష్టికి తీసుకెళ్లండి..
పరిష్కరిస్తారు.’’
– కార్యకర్తల సమావేశంలో
మంత్రి టీజీ భరత్
● బీజేపీ కార్యకర్తల సమావేశంలో టీజీ వెంకటేష్ ఎత్తిపొడుపు
డాక్టర్ పార్థసారధి ఆదోనికి ఎమ్మెల్యేలా కాకుండా కేవలం ఒక కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం మౌర్యా ఇన్‌లోని పరిణయ హాల్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధితో పాటు టీజీ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీజీ మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్థసారధి ఓ కులానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందని అనడంతో పార్థసారధి తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. టీజీ భరత్ ఇంటి దగ్గర బీజేపీ సీనియర్ నాయకుడు హరిష్ కుమార్‌కు అవమానం జరగడం, సాయంత్రం కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యేను టీజీ వెంకటేష్ కించపరుస్తూ మాట్లాడటం ఒకే రోజు చోటు చేసుకోవడం గమనార్హం.
‘‘పీఏలు అధ్వానంగా
తయారయ్యారు.
కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. డబ్బున్న వాళ్లకే పనిచేసి
పెడుతున్నారు. వాళ్ల
వ్యవహారశైలి కూడా చాలా దారుణంగా ఉంటోంది.’’
– కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆవేశం
కర్నూలు: జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌పై కర్నూలు అర్బన్ తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు అందుబాటులో ఉండడం లేదని, ఇటీవల మౌర్యా ఇన్‌లో జరిగిన పార్టీ ఇంచార్జీలు, కార్పొరేటర్ల సమావేశంలో పలువురు టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నగరంలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామని, ఓట్లు వేయించుకొని గెలుపొందిన తరువాత అందుబాటులో ఉండడం లేదని వార్డు ప్రజలు తమను నిలదీస్తున్నారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి కలుగజేకొని సమస్యలుంటే తన పీఏల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని చెప్పడం కార్యకర్తల ఆవేశానికి కారణమైంది.
● ఓ మహిళా కార్యకర్త లేచి తన స్థలం ఆక్రమణకు గురవుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా, పీఏలు ఆక్రమణదారులకే వంత పలుకుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
● కార్యకర్తలు అసహనంతో మాట్లాడుతున్న తీరుపట్ల సమావేశంలో పాల్గొన్న మెజారిటీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా చప్పట్లు, ఈలలు వేసి తమ సంఘీభావాన్ని తెలపడంతో మంత్రి టీజీ స్పందిస్తూ అమరావతి స్థాయిలో తన పనులే కావడం లేదు, నేనెవరికి చెప్పుకోవాలంటు తీవ్ర ఆవేశానికి లోనయ్యారని సమాచారం.
● మరి కొందరు కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా, తీవ్ర అసహనానికి గురై తన చేతిలో ఉన్న మైక్‌ను నేలకేసి కొట్టి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు చర్చ జరుగుతోంది.
తాజాగా బీజేపీ సీనియర్ నేతకు
అవమానం
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన సందర్భంగా టీజీ ఇంట్లో సీనియర్ బీజేపీ నేత హరీష్‌కుమార్ జరిగిన అవమానం కూడా కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశం కావడమే గాక, టీడీపీ వర్సెస్ బీజేపీ చందంగా మారింది. శనివారం మంత్రి సత్యకుమార్ పలు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ తన ఇంటికి భోజనానికి మంత్రి సత్యకుమార్‌ను ఆహ్వానించారు. అయితే గతంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ బదిలీ వ్యవహారంలో మంత్రులు ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నడిచిందని తెలిసింది. గతంలో సూపరిటెండెంట్‌గా ఉన్న సి.ప్రభాకర్‌రెడ్డికి సత్యకుమార్ సపోర్టుగా నిలువగా, టీజీ భరత్ తన పలుకుబడిని ఉపయోగించి తనకు కావాల్సిన అధికారిని ఇక్కడకు తెచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అగాథం చోటు చేసుకుంది. ఈ నేఫథ్యంలోనే మంత్రి టీజీ ఇంటికి భోజనానికి వెళ్లేందుకు మంత్రి సత్యకుమార్ సంశయిస్తూ కాలయాపన చేశారు. విషయం తెలుసుకున్న టీజీ వెంకటేష్ జోక్యం చేసుకొని ఎట్టకేలకు సత్యకుమార్‌ను తన ఇంటికి రప్పించుకున్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌కు పీఏగా ఉన్న జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు హరీష్‌కు తీవ్ర అవమానం జరిగిన ఘటనపై జోరుగా బీజేపీలో చర్చ జరుగుతోంది. హరీష్‌కుమార్ మంత్రితో పాటు టీజీ ఇంట్లోకి భోజనానికి వెళ్తుండగా, ద్వారం వద్దనే టీజీ వెంకటేష్ అడ్డుపడి లోపలికి కేవలం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రమే రావాలంటూ హరీష్‌ను చేయిపట్టుకొని బయటకు పంపడం పట్ల బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ అంశం ఇరుపార్టీల్లోని కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తోంది.

తండ్రీకొడుకులు నోరు పారేసుకుంటున్నారు. సొంత పార్టీ లేదు

తండ్రీకొడుకులు నోరు పారేసుకుంటున్నారు. సొంత పార్టీ లేదు