● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి ● మోటారు సైకిల్‌ను ఢీకొన్న లారీ ● పెద్దహోతూరు సమీపంలో దుర్ఘటన
ఆలూరు/ఆస్పరి: పేదింట్లో విషాదం నెలకొంది. పేదరికం నుంచి బయట పడేందుకు నలుగురు పిల్లలను చదివిస్తున్న ఆ కుటుంబంపై విధి పగపట్టింది. లారీ రూపంలో తండ్రి వడ్డె ఈరన్న(45)ను, అతని రెండో కుమార్తె వడ్డె శ్రావణి (14)ని కబళించింది. ఈ దుర్ఘటన పెద్దహోతూరు సమీపంలో నిర్మాణంలో నిలిచిన టోల్‌గేట్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఈరన్న, రాధమ్మ దంపతులకు సెంటు భూమి లేదు. ఈరన్న టైలర్‌గా, రాధమ్మ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగించేవారు. వీరి పెద్ద కుమార్తె హిందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుని తండ్రి దగ్గర టైలరింగ్ పని నేర్చుకుంటోంది. రెండో కుమార్తె శ్రావణి (14) చిప్పగిరిలో కస్తూర్బా పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడో కుమార్తె స్వాతి 6 తరగతి మండలంలోని బిల్లేకల్లు హైస్కూల్లో, చిన్న కుమారుడు విక్రమ్ 3వ తరగతి ముత్తుకూరులోనే చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యా శాఖ అధికారులు సెలవులు ప్రకటించడంతో రెండో కుమార్తె వడ్డె శ్రావణి ని తీసుకొచ్చేందుకు తండ్రి వడ్డె ఈరన్న మోటార్ సైకిల్‌పై చిప్పగిరి వెళ్లాడు. పాఠశాల నుంచి రెండో కుమార్తె శ్రావణితో పాటు సొంతూరుకు వస్తుండగా కర్నూలు నుంచి ఆలూరు వైపు వస్తున్న లారీ పెద్దహోతూరు సమీపంలో బలంగా ఢీ కొట్టింది. దీంతో తండ్రి, కుమార్తె ఇద్దరూ ఒక్కసారిగా టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆలూరు ఎస్‌ఐ మహబూబ్‌బాషా ,హెడ్ కానిస్టేబుల్ జానీవాకర్, పోలీసులు ప్రమాద స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మృతుల కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
ప్రమాద విషయం తెలుసుకుని ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి ఆసుపత్రికి వచ్చారు. తండ్రి, కుమార్తెల మృతదేహాలను పరిశీలించారు. వడ్డె ఈరన్న భార్య వడ్డె రాధమ్మను, కుమార్తెలు హిందు, స్వాతి, కుమారుడు విక్రమ్, సమీప బంధువులను ఓదార్చారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు ప్రమాద సూచికలను, రేడియం స్టిక్కర్లును ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. మృతుల కుటుంబాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. ఎమ్మె ల్యే వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు భాస్కర్, వీరేష్, బాబు, ఆలూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మల్లికార్జున, ఎంపీపీ రంగమ్మ, రాముడు ఉన్నారు.
విషాదం
విషాదం