మహబూబాబాద్: ఈ తీజ్ వేడుకల్లో మొదటి రోజు తండావాసులు గుమిగూడి తండా పెద్దమనిషి ఇంటి వద్ద సాయంత్రం వేళ గోధుమలు, శనగలు, నవధాన్యాలను నానబెడతారు. రెండో రోజు నాన బెట్టిన గోధుమలను చిన్న చిన్న బుట్టల్లో (దుస్సే రు తీగతో అల్లినవి) మట్టి, సేంద్రియ ఎరువు అలికిన తర్వాత పాటలు పాడుతూ బుట్టల్లో గోధుమలు విత్తుతారు. మూడో రోజు ఉదయం మంచె(ఢాక్లో) ఏర్పాటు చేసి గోధుమ చల్లిన బుట్టలను మంచెపై పెడతారు.
అనంతరం పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులపాటు రోజూ పాటలు పాడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీజ్ బుట్టల్లో నీరు పోస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు వీరి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలాతో తయారు చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించరు. నియమ నిష్టలతో ఉంటూ ఆకు కూరలు, జొన్నరొట్టెలు తింటూ తీజ్‌ను (గోధు మ నారును) కాపాడుకుంటారు.
తీజ్ పండుగను సేవాలాల్ మహరాజ్, దండి మేరమా దేవతనే జరిపిస్తుందని గిరిజనుల విశ్వాసం. ఏడో రోజు ఢమోళీ పూజ ఘనంగా జరుపుకుంటారు. తొక్కుడు పడని నల్లమట్టి తెచ్చి (అబ్బాయి, అమ్మాయి ప్రతిమలు) బొమ్మలు తయారు చేస్తారు. వీటిని గణగోర్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా బియ్యం పిండితో చేసిన రొట్టెల్లో బెల్లం కలిపి నైవేద్యం (చూర్మో) తయారు చేస్తారు.
అనంతరం డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికి వెళ్లి చూర్మో పంచుతూ నృత్యాలు చేస్తారు. రాత్రి సమయంలో అందరూ తీజ్ మంచె దగ్గర కలుసుకొని పాటలు పాడుతూ అమ్మాయిల చేత నెయ్యి, బెల్లం అన్నం కలిపి(దప్కార్) ఇస్తారు. చివరగా గణగోర్ బొమ్మలను తీజ్ వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు తీజ్ నిమజ్జ న కార్యక్రమంలో భాగంగా తండావాసులందరూ కలిసి సేవాలాల్ మహరాజ్‌కు బెల్లం అన్నం (కడవో) నైవేద్యంగా పెడతారు.
మేరమా యాడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం వేళ మంచె ఢాక్లో పైనుంచి తీజ్ బుట్టలను అమ్మాయిలు తీసుకుని బాధాతప్త హృదయంతో తీజ్ తమను వదిలి వెళ్తోందని ఆటపాటలతో దగ్గరలోని కుంటలు, చెరువుల్లో బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment