‘పేట’.. సమస్యల మూట.. కాబోయే ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం! | - | Sakshi
Sakshi News home page

‘పేట’.. సమస్యల మూట.. కాబోయే ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం!

Published Tue, Nov 7 2023 1:40 AM | Last Updated on Tue, Nov 7 2023 11:03 AM

- - Sakshi

సాక్షి, వరంగల్/మహబూబాబాద్‌: నర్సంపేట.. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పాకాల సరస్సు, మాదన్నపేట, తదితర చెరువుల ఆయకట్టు పరిధిలో అత్యధిక స్థాయిలో సాగు అవుతోంది. ఫలితంగా నిత్యం పంట పొలాలతో ఈ నియోజకవర్గం మరో కోనసీమలా కళకళలాడుతోంది. వివిధ ఉద్యమాలు, పోరాటాలకు కేంద్ర బిందువై నిత్య చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గం స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది.

గత ప్రభుత్వాలు అభివృద్ధి చేసినప్పటికీ చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే ఎమ్మెల్యేకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,26,617ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,11,870, సీ్త్రలు 1, 14, 742 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చేపట్టాల్సి న అభివృద్ధి కార్యక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

నర్సంపేట పట్టణంలో..
నర్సంపేట.. వరంగల్‌ జిల్లాలో ప్రముఖ పట్టణంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ పనులు జరుగుతున్నా డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 40వేల జనాభా పైబడి ఉన్న పట్టణంలో నేటి వరకూ ఆహ్లాదం కోసం పార్కు లేదు. తాగునీరు కోసం మిషన్‌ భగీరథ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పట్టణంలోని డ్రెయినేజీ నీరు మాదన్నపేట పంట కాలువలోకి వెళ్తోంది. ఫలితంగా పంటలు దెబ్బతినడంతో పాటు రైతులు పలు వ్యాధులకు గురవుతున్నారు.

నెక్కొండ మండలంలో..
నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. విద్యుత్‌, తాగునీరు సౌకర్యం లేదు. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. ఇక బస్సులు కూడా రాకపోవడంతో ఇటు వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. దీంతో చికెన్‌ వ్యర్థాలు, వ్యాపార సముదాయాల నుంచి వచ్చే చెత్తకు నిలయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.

పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ డంపింగ్‌ యార్డును తలపిస్త్తోంది. నెక్కొండ మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో మరుగుదొడ్లు లేకపోవడంతో స్థానిక ప్రజలతోపాటు రైళ్లు, బస్సుల్లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సులభ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

చెన్నారావుపేట మండలంలో..
చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయినిపహాడ్‌, పాపయ్యపేట, లింగగిరి, గొల్లపల్లితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు. కనీసం ఆ రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు. తారు రోడ్లు వేసి ప్రయాణ సౌకర్యం కల్పించాలి. చెన్నారావుపేట–ఖానాపురం, తిమ్మరాయినిపహాడ్‌–రంగాపురం గ్రామాలను కలిపే మున్నేరువాగుపై (పాకాల) చెక్‌డ్యాంతో పాటు వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ హామీలు అలాగే ఉంటున్నాయి.

వంతెనల నిర్మాణం పూర్తయితే వాగు పరిధిలో ఉన్న రైతులకు వ్యవసాయ పనుల్లో సమ స్యలు తప్పుతాయి. అంతే కాకుండా రెండు మండలాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. మండలంలోని కోనాపురం, నంబర్‌వన్‌ కాలనీతో పాటు పలు గ్రామాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాకపోవడంతో పూర్తిస్థాయిలో గ్రామ పాలకవర్గం నీరు అందించలేకపోతోంది. నీటి సమస్య పరిష్కారానికి పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటు చేయాలి.

దుగ్గొండి మండలంలో..
దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరు పడకలతోనే కొనసాగుతుంది. దీనిని 30 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి వైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించినా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలి. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని నిరుపేద విద్యార్థులు కోరుతున్నారు.

30 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలి!
దుగ్గొండి మండలంలో 42 వేల జనాభా ఉంది. పేదలు అనారోగ్యం బారిన పడితే 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి దుగ్గొండి ఆస్పత్రిని 30 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలి. అన్ని రకాల వ్యాధులకు ఇక్కడే చికిత్స అందించి ప్రజా ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. – వడ్డేపల్లి చంద్రమౌళి, నాచినపల్లి మాజీ జెడ్పీటీసీ

‘అసైన్డ్‌’కు పట్టాలివ్వాలి..
నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారులో మాకు ఐదు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. మూడు తరాల నుంచి ఈ భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. పట్టా పా స్‌బుక్‌ కోసం పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిశాం. పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని అడిగాం. కానీ నేటి వరకూ ఇవ్వలేదు. ఇప్పటికై నా పాలకులు స్పందించి అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలి. – గోనె జువాకర్‌, రైతు, నాగరాజుపల్లి

ఖానాపురం మండలంలో..
ఖానాపురం మండలంలోని ప్రధాన నీటి వనరు పాకాల సరస్సు. పాకాల తూములు శిథిలావస్థకు చేరి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువలు తుంగబంధం, పసునూరు, మాటు వీరారం, జాలుబంధం, సంగెం, తదితర కాల్వలు ఏటా గుర్రపుడెక్కతో నిండిపోయి చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. తద్వారా రైతులు సాగుకు ప్రతీ సంవత్సరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పాకాల ఆయకట్టు పరిధిలో వరి పంట పెద్ద ఎత్తున సాగవుతుంది. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌ యార్డులో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తున్నారు. సబ్‌ మార్కెట్‌ యార్డును ఆఽధునికరిస్తే రైతులకు కొంత మేర ఇబ్బందులు తప్పనున్నాయి. మండలంలోని బుధరావుపేటలో 3/1 సర్వే నంబర్‌లో గల అసైన్డ్‌ భూమిపై కొన్ని సంవత్సరాలుగా అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

డిగ్రీ కళాశాల, స్టేడియం ఏర్పాటు చేయాలి..
నెక్కొండ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్టేడియం, ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, యువతకు క్రీడల్లో ఆసక్తి పెంపొందడానికి మండలంలో స్టేడియం ఏర్పాటు చేయాలి. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యలు పరిష్కరించాలి. – బొమ్మెర శ్రీనివాస్‌, నెక్కొండ

కాల్వలను ఆధునికీకరించాలి..
పాకాల ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాల్వలను ఆధునికీకరించాలి. తూములకు మరమ్మతులు చేయించాలి. ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. – కుదురుపాక రాములు, అశోక్‌నగర్‌
ఇవి చదవండి: ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement