కన్నీటి వీడ్కోలు పలికిన అంకుషాపూర్
నివాళులర్పించిన గ్రామస్తులు,
పలు సంఘాల నాయకులు
కాటారం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ అలియాస్ శ్రీధర్ అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం కాటారం మండలం అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలు సంఘాలు, మాజీ మావోయిస్టు నేతలు అన్నె సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
అంతకుముందు విప్లవ గీతాలు, నినాదాలతో అంకుషాపూర్ నుంచి దస్తగిరిపల్లిలోని తన ఇంటి వరకు సంతోష్ మృతదేహాన్ని ర్యాలీగా తీసుకువచ్చారు. 23 ఏళ్ల తర్వాత సంతోష్ విగతజీవిగా రావడం చూసి గ్రామస్తులు బోరున విలపించారు. కాగా, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, సత్యవతి, విరసం నాయకులు బలసాని రాజయ్య, మహేందర్, శంకర్, ప్రగతిశీల నాట్యమండలి కళాకారులు నవత, పౌరహక్కుల సంఘం నాయకుడు వినోద్, ప్రజాఫ్రంట్ నాయకులు కొంరయ్య, రవి, తదితరులు.. సంతోష్‌కు నివాళులర్పించారు.
సాయంత్రం స్వగ్రామం చేరుకున్న సంతోష్ మృతదేహం..
కర్రెగుట్ట అడవుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్నె సంతోష్ అలియాస్ సాగర్ మృతి చెందినట్లు బీజాపూర్ పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సాయంత్రం అధికారికంగా నిర్ధారించారు. సంతోష్ మృతదేహాన్ని గుర్తించడానికి ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రజాప్రతినిధి ద్వారా తల్లిదండ్రులు అన్నె ఐలయ్య, సమ్మక్కను బీజాపూర్‌కు పంపించారు. వారు ఉదయం అక్కడికి చేరుకునే లోగా సంతోష్‌గా భావించే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రుల గుర్తింపు కోసం ఉంచారు. వారు తమ కుమారుడే అని గుర్తించడంతో మృతదేహాన్ని అప్పగించారు. దీంతో సంతోష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి సాయంత్రమైంది.
కొనసాగిన పోలీసుల నిఘా..
సంతోష్ అంత్యక్రియల సమయంలో అడుగడుగునా పోలీసులా నిఘా కొనసాగింది. ఇంటెలిజెన్స్, సివిల్ పోలీసులు మఫ్టీలో సంతోష్ అంత్యక్రియలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment