మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తున్న పోలీసులు
వరంగల్ క్రైం: కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న అలజడులు.. పనిచోట వేధింపులు.. కళాశాలలు, పాఠశాలల దగ్గర పోకిరీల ర్యాగింగ్.. ఇలా ఏ ఘటన జరిగినా బాధిత మహిళలు, బాలికలకు పోలీసులు భద్రత, భరోసా కల్పిస్తున్నారు. ఆపద సమయంలో మేం అండగా ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. మహిళ, బాలికల రక్షణకు పోలీస్ స్టేషన్లతో పాటు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు, ‘షీ’టీమ్స్ విభాగం, భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు అండగా నిలుస్తున్న పలు విభాగాల సేవలు అతివలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు, బాలికల రక్షణకు పోలీసులు, ‘షీ’ టీమ్స్ తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
మఫ్టీలో ‘షీ’ టీమ్స్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ‘షీ’ టీమ్స్ విభాగం అధికారులు పోకిరీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్దేశించిన హాట్‌స్పాట్‌ల వద్ద ‘షీ’ టీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిల ఆట కట్టిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, కళాశాలలు, పాఠశాలల వద్ద మఫ్టీలో ఉంటూ ఎవరైనా ఆకాయిలు.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే వారిని పట్టుకుంటున్నారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి శృతి మించితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.
బాధితులకు సాయం..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా బాలికలు, మహిళలు లైంగికదాడికి గురైతే వారిని వెంటనే భరోసా కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ కేంద్రంలో ఏఎన్‌ఎం సేవలతో పాటు లీగల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగే వరకూ భరోసా కేంద్రం అధికారులు అండగా నిలుస్తున్నారు. బాధితుల స్టేట్‌మెంట్ రికార్డు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ వాతావరణం కనిపించకుండా, బాధితులు భయపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నారు.
మహిళలపై ఆగని దాడులు..
పోలీసులు మహిళా రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్న వారిపై దాడులు మాత్రం అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. గతేడాది వరకట్న మరణాలు 10 జరగగా 39 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలపై వే ధింపులకు పాల్పడిన నేపథ్యంలో గత సంవత్సరం 626, ఈ ఏడాది 91 కేసులు నమోదయ్యాయి. గతేడాది లైంగికదాడి కేసులు 146 కాగా , ఈ ఏడాది ఇప్పటి వరకు 22 జరిగాయి.
మహిళా పీఎస్‌లో కేసు తీవ్రతను బట్టి కౌన్సెలింగ్..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండ జిల్లాకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ (అర్బన్) రంగంపేటలో ఉండగా, వరంగల్, జనగామ జిల్లాలకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సుబేదారిలో ఉంది. దంపతులు, కుటుంబాల కలహాలు, వివాహేతర సంబంధాలు, వరకట్న కేసులు, దాడులు.. ఇలా అనేక అంశాలలో ఫిర్యాదులు స్వీకరించి వాటి తీవ్రతను బట్టి మొదటి కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తరువాత కేసులు నమోదు చేస్తున్నారు. బాధిత మహిళలకు కావాల్సిన అనేక రకాల విషయాలపై కౌన్సెలింగ్ నిర్వహించి అండగా నిలుస్తున్నారు.
ఫోన్ చేస్తే చాలు.. పట్టేస్తాం
మహిళలు, బాలికలు తమను పోకిరీలు ఇబ్బందులకు గురిచేసినా, ఫోన్లకు అసభ్యకర ఫొటోలు పంపినా, బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడినా ఫోన్ చేస్తే చాలు.. పోకిరీలను పట్టుకుని వారి ఆట కట్టిస్తాం. మహిళలు, బాలికలు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు. కుటుంబీకులతో చెప్పుకోలేని విషయలను కూడా మా దగ్గర చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా అండగా ఉండి రక్షిస్తాం. ఇబ్బందులు తలెత్తుతే నేరుగా 8712 685142 నంబర్‌కు ఫోన్ చేయండి.
–కొడురి సుజాత, ఇన్‌స్పెక్టర్ ‘షీ’ టీమ్స్
పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’ టీమ్‌లు
బాధిత మహిళలకు ‘భరోసా’ కేంద్రం..
అతివలకు మహిళా పోలీసు స్టేషన్లు
కొండంత అండ
మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment