
బైక్‌ను తప్పించబోయి.. ట్రాలీ ఆటో బోల్తా
నడికూడ/కమలాపూర్ : కూలీలను తరలిస్తున్న ఓ ట్రాలీ ఆటో..ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్రంగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పరకాల ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన 38 మంది పరకాల మండలం మల్లక్కపేటలో కూలీకి వెళ్లారు. పనులు ముగించుకుని మధ్యాహ్నం ట్రాలీ ఆటోలో తిరిగి స్వగ్రామం బయలుదేదారు. ఈ క్ర మంలో నడికూడ మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఇదే మండలం చర్లపల్లికి చెందిన రావుల కొమురుమల్లు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ట్రాలీ ఆటోకు అడ్డు రావడంతో డ్రైవర్ అతడిని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులందరినీ 108లో కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన ఐదుగురితో పాటు స్వల్ప గాయాలైన 10 మందిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
22 మందికి గాయాలు
నడికూడ మండల కేంద్రంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment