వీసీని కలిసిన పోలీస్ కమిషనర్
కేయూ క్యాంపస్: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డిని బుధవారం యూనివర్సిటీలో కలిశారు. వీసీకి పుష్పగుచ్ఛం అందించారు. కాగా.. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సన్మానించారు. అనంతరం వర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఎర్రగట్టు జాతర ఆదాయం రూ.16,33,296
హసన్‌పర్తి: ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వర స్వామి ఆలయ జాతర ఆదాయం రూ.16,33,296 వచ్చినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఈఓ వెంకట్‌రావు తెలిపారు. దేవస్థానంలో హుండీలను బుధవారం లెక్కించగా ఆదాయ వివరాలను వారు వెల్లడించారు. వేలం ద్వారా రూ.6,22,500, కల్యాణం ద్వారా రూ.11,160, శీఘ్ర దర్శనం ద్వారా రూ.68,800, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.1,92,450, అర్చనల ద్వారా రూ.60,700, విరాళాలు రూ.12,364, స్వామి వారి కట్నాలు రూ.6,859, కేశఖండనం ద్వారా రూ.40, గండదీపం ద్వారా రూ.36,232, హుండీ ఆదాయం రూ.5,88,225, తైబజార్ ఆదాయం రూ.33,966 వచ్చినట్లు వివరించారు. గత జాతర కంటే ఈసారి రూ.3,49,583 ఆదాయం ఎక్కువ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు శీలం రమేశ్, కనపర్తి రాజు, సంతోశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
కేయూకు బ్లాక్ గ్రాంట్ రూ.145 కోట్లు
కేయూ క్యాంపస్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్‌గ్రాంట్ నిధులు సుమారు రూ.10 కోట్ల వరకు పెరిగాయి. ఈఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్‌లో బ్లాక్ గ్రాంట్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యాపకుల, ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల కోసం రూ.114.62 కోట్లు కేటాయించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం రూ.31 కోట్లు కేటాయించారు. కాగా.. ఈఆర్థిక సంవత్సరానికి వర్సిటీలో డెవలప్‌మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో మొత్తం రూ.145.62 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.10 కోట్ల వరకు పెరిగినట్లయింది. కాకతీయ యూనివర్సిటీ వీసీగా కె.ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలవుతోంది. పలు మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ పెంచాలని, అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ప్రతిపాదనలు కూడా పంపారు. అందుకు వీసీ కృషి చేయడంతో కేటాయించిన నిధులు పెరిగినట్లు భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో నిధులు పెరగడంతో అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మానుకోటలో మహిళ ఆత్మహత్యాయత్నం
మహబూబాబాద్ రూరల్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ ఒక ఎస్సైతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఆయన తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో మహిళతో సన్నిహితంగా ఉండగా.. పద్ధతి మార్చుకోమని చెప్పగా పట్టించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో సదరు మహిళ మానసిక వేదనకు గురై మానుకోటలోని జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. కాసేపటికే ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.
వీసీని కలిసిన పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment