పట్టపగలే యువకుడి దారుణ హత్య
జఫర్‌గఢ్: తన వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న యువకుడిని మరో గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కత్తితో పొడిచి చంపిన ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని తీగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తీగారం గ్రామానికి చెందిన గోనె యాదగిరి– ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు గోనె ప్రవీణ్ (28) ఇంటి వద్దనే ఉంటూ తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసిన అనంతరం ప్రవీణ్ నీళ్లు పెట్టేందుకు గ్రామ శివారులో ఉన్న తమ వరిపొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇదే మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామానికి ఆరుగురు యువకులు మూడు ద్విచక్రవాహనాలపై తీగారం గ్రామానికి చేరుకొని ప్రవీణ్‌ను అనుసరించారు. పొలం వద్ద ఒంటరిగా ఉన్న ప్రవీణ్‌పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో కడుపులో 5 పొట్లు పొడిచి అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. కత్తిపొట్లకు గురైన ప్రవీణ్ పెద్ద పెట్టున అరవడంతో కొద్దిదూరంలో ఉన్న సమీప బంధువులు రక్తపు మడుగులో ప్రవీణ్‌ను స్థానికులు, కుటుంబ సభ్యుల సాయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, యువకుడి హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. హోలీ పండుగ పూట గ్రామంలో యువకుడి హత్యతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునన్నట్లు ఎస్సై రామ్‌చరణ్ వెల్లడించారు.
తీగారంలో హోలీ రోజున ఘటన
భయాందోళనకు గురైన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment