Telangana Crime News: గంజాయి నియంత్రణకు విస్తృత తనిఖీలు
Sakshi News home page

Mahabubnagar:పల్లెలు జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు

Published Thu, Jan 11 2024 7:54 AM | Last Updated on Thu, Jan 11 2024 9:07 AM

- - Sakshi

గంజాయితో పట్టుబడిన ఓ వ్యక్తి (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌ క్రైం: ‘హైదరాబాద్‌లో గంజాయితో పాటు డ్రగ్స్‌ ప్రభావం ఎక్కువగా ఉంది.. ఇది క్రమంగా పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా దీనికి అడ్డుకట్ట వేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాయి. వీరంతా గంజాయి నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు.

ఇప్పటికే వారం రోజుల నుంచి నిత్యం తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నారా అనే విషయం ఆరాతీస్తున్నారు. ఇక గంజాయి వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. తండాల్లో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారులు డబ్బు ఆశ జూపి పత్తి, కంది పంటలలో గుట్టుచప్పుడు కాకుండా అంతర పంటగా గంజాయి సాగు చేయిస్తున్నారు.

ఇందుకోసం అటవీ ప్రాంతాలకు సమీపం, ఊరికి దూరంగా ఉన్న పొలాలను అనువైన భూములుగా ఎంచుకుంటున్నారు. గతంతో పోలిస్తే జిల్లాలో గంజాయి సాగు కొంత తగ్గుముఖం పట్టినా.. మారుమూల గ్రామాల్లో అక్కడక్కడ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది జిల్లాలో మూడు గంజాయి కేసులు నమోదు కాగా.. కిలోన్నర ఎండు గంజాయి సీజ్‌ చేశారు. అలాగే ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు.

నిఘా పెట్టాం..
జిల్లాలో గంజాయి కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా మహబూబ్‌నగర్‌ పట్టణంపై ఎక్కువ నిఘా పెట్టడం జరిగింది. డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో సాగు లేకపోయినా డ్రై గంజాయి విక్రయాలపై కూడా దృష్టిసారించాం. గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – సైదులు, ఈఎస్‌ మహబూబ్‌నగర్‌

ఎండు గంజాయి దిగుమతి..
జిల్లాలో గంజాయి సాగు తగ్గినా.. ఎండు గంజాయి దిగుమతి అధికంగానే ఉంటుంది. హైదరాబాద్‌, ఏపీ, కర్ణాటక నుంచి రవాణా జోరుగా సాగుతోంది. గతంలో గంజాయి దందా చేసిన వారు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అధికంగా ఎండు గంజాయి తీసుకువచ్చి ప్రత్యేకంగా గ్రాముల్లో ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు అందజేస్తుంటారు.

బండమీదిపల్లిని అడ్డాగా చేసుకొని ఈ దందా భారీ స్థాయిలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని అరబ్‌గల్లీ, బీకేరెడ్డికాలనీ, కొత్త చెరువు రోడ్‌, మోటార్‌లైన్‌, వీరన్నపేట, షాషాబ్‌గుట్ట కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ట్యాంక్‌బండ్‌, కొత్త చెరువు రోడ్‌ సమీపంలో అయితే రాత్రి 10.30 గంటల తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది యువత చేరుకొని గంజాయిని తీసుకుంటున్నారని తెలుస్తోంది.

దీంతోపాటు కొత్త బస్టాండ్‌ దగ్గర, మార్కెట్‌ రోడ్‌లో కూడా గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం. కేవలం 17 నుంచి 28 ఏళ్ల మధ్య వారితోపాటు ఆటోలు నడుపుతున్న కొందరు యువకులు దీనిని అధికంగా తీసుకుంటున్నారు.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ దందాలకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ విభాగం పనిచేస్తోంది. ఇందులో ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా 24 గంటల పాటు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, పాత గంజాయి విక్రయదారులపై నిఘా పెట్టడం చేస్తుంటారు.

ఇక ఎక్సైజ్‌ శాఖలో డీటీఓ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మహబూబ్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓ కలిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ టీంలో సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, సర్కిల్‌ పరిధిలో ఒక సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి పదిమంది వరకు ఉంటారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తారు. గంజాయి అక్రమ రవాణా, సాగు చేసినా వెంటనే చర్యలు చేపడుతున్నారు.

బానిసైతే ప్రమాదం..
మత్తు పదార్థాలకు మనిషి ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. మాములుగా డ్రగ్స్‌ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి అవసరమైన మోతాదులో వైద్యులు ఇస్తుంటారు.

ఇలాంటి డ్రగ్స్‌ను ఎక్కువగా వినియోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిత్యం తీసుకోవాలని చూస్తారు. ఇలాంటి మత్తుకు అలవాటుపడిన వారికి అందుబాటులో లేకపోతే ఒక్కోసారి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ.. లేదా తనకు తాను గాయపరుచుకోవడం.. లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement