బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా
ఊర్కొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మండల కేంద్రంలోని కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై బంధువులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాంరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన చిన్న వెంకటయ్య (54) శుక్రవారం రాత్రి కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై కాలినడకన స్వగ్రామం వెళ్తున్నాడు. ఈక్రమంలో బైకు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య తెరపోగు పద్మ, కుమారుడు, కూతురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేస్తే తప్ప డొక్కాడని బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఎస్‌ఐ కృష్ణదేవ ధర్నా వద్దకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాయకులు హరీష్, జంగారెడ్డి, ఆంజనేయులు, సుజీవన్ రెడ్డి, లాలయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment