వైభవం.. అలివేలుమంగ రథోత్సవం
అశ్వవాహనసేవ..
అలివేలు మంగతాయారు ఆలయంలో శనివారం రాత్రి అశ్వవాహనసేవ నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల హరినామస్మరణ, పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాలు, కాగడాల వెలుతురులో అశ్వవాహనం ముందుకు కదిలింది. స్వర్ణాభరణాల అలంకరణలో వేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగతాయారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. విశేష దినోత్సవం సందర్భంగా గుట్టపైనున్న లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవిందు, అలువేలమ్మ, సుధ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
● ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవం, పూర్ణాహుతి, అవభృతస్నానం, రాత్రికి నాగబలి (నాగవెల్లి), ద్వాదశ ఆరాధన, సప్తావరణాలు, మహ ఆశ్వీరచనం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి.
రథంపై ఉరేగుతున్న స్వామి, అమ్మవార్లు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ అలివేలుమంగతాయారు రథోత్సవం (విమాన రథోత్సవం) శుక్రవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా శోభాయమానంగా అలంకరించిన గరుడ వాహనంపై వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఉంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గర్భాలయం నుంచి ప్రధాన ద్వారం మీదుగా ఆలయ ఆవరణలోని రథం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం రంగురంగుల పూలు, విద్యుద్ధీపాలు, మామిడి తోరణాలతో ముస్తాబుచేసిన రథంపై ఉంచారు. రథం ముందు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు చేస్తూ ముందుకు లాగారు. సాంప్రదాయ రీతిలో ఆలయం ముందున్న దేవగుండు వద్దకు లాగి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. రథోత్సవానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. బంగారు ఆభరణాలు, కాగడాలు, విద్యుద్ధీపాల వెలుతురులో స్వామి, అమ్మవార్లు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మళ్లీ ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై గర్భగుడి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రత్యేక అభిషేకం, బలిహరణం, హోమం తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి.
ఘనంగా గరుడవాహన సేవ
భక్తి పారవశ్యంతో పులకించిన భక్తులు
వైభవం.. అలివేలుమంగ రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment