మహిళా కూలీలే లక్ష్యం
మహబూబ్‌నగర్ క్రైం: ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. అడ్డా మీద ఉండే మహిళా కూలీలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. పూర్తిగా జల్సాలకు, అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడి మహిళా కూలీలను తీసుకెళ్లి వారిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు దోచుకుంటున్న ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డి.జానకి వెల్లడించారు. మహ్మదాబాద్ మండలం చౌడాపూర్ తండాకు చెందిన కట్రావత్ భరత్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను కోస్గి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన కామారం నరేష్, టంకరకు చెందిన సామే శోభతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి మద్యం తాగుతూ జల్సాలు చేయడం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో ఈనెల 12న ఉదయం 10 గంటల సమయంలో జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట అడ్డా మీదకు కూలీ పని కోసం వచ్చిన వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంజమ్మతో పాటు మరో మహిళను పని ఇప్పిస్తామని అని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. మొదట దొడ్డలోనిపల్లికి వెళ్లి అక్కడి నుంచి మయూరి పార్క్ సమీపంలో అడవిలోకి ఇద్దరూ మహిళలను తీసుకువెళ్లి వారిపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలు తీసుకున్నారు. అదేవిధంగా మరో కేసులో కామారం నరేష్ ఈ నెల 13న టీడీగుట్ట దగ్గర కూలీ పని కోసం ఎదురుచూస్తున్న మరో మహిళను ఆటోలో కొత్త కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి మెడలో ఉన్న పుస్తెలతాడు, కాళ్ల కడియాలు అపహరించాడు. ఈ రెండు కేసుల్లో ఏ1 కట్రావత్ భరత్, ఏ2 కామారం నరేష్, ఏ3 సామే శోభలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు చేధించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య పాల్గొన్నారు.
దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి
Comments
Please login to add a commentAdd a comment