అలంపూర్: పంటల సమగ్ర పోషక యాజమాన్యంలో వేప ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కీటకాలను సమర్థవంతంగా ఎదుర్కొనే అజాడి రక్తిన్ అనే పదార్థం వేప గింజలో సమృద్ధిగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ సూచించారు. వేప గింజల నుంచి పిండిని తయారుచేసి పంటలకు ఉపయోగించవచ్చని తెలిపారు. వేప పిండిలో ఉండే లక్షణాలు, ఉపయోగాలను ఆయన రైతులకు వివరించారు.
పోషకాలు: వంద కిలోల వేప పిండిలో 3.56 కిలోల నత్రజని, 0.83 కిలోల భాస్వరం, 1.67 కిలోల పొటాషియం ఉంటుంది. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఐదు కిలోల వేప పిండిని 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టిన తర్వాత పలచటి గుడ్డతో వడగట్టి వచ్చిన ద్రవణాన్ని పంటలకు పిచికారీ చేస్తే అనేక లాభాలు ఉన్నాయి.
ఆహార ధాన్యాల్లో: వరిపంటలో వేప పిండిని యూరియాతో 5:1 నిష్పత్తిలో చల్లితే చీడపీడలు ఆశించవు. 30శాతం నత్రజని ఆదా అవుతుంది. మొక్కలు నత్రజని తీసుకునే శక్తిని పెంచవచ్చు. ఎకరాకు 80 కిలోల వేప పిండిని వాడితే కాయతొలుచు పురుగు, ఉల్లి కోడును నివారించవచ్చు.
● కంది, పెసర, మినుము, ఆముదం పంటల్లో ఎకరాకు 80 కిలోల వేప పిండి వాడటం వల్ల పురుగుల బెడద తగ్గించవచ్చు. 5శాతం వేప కషాయం పిచికారీతో రెక్కల పురుగుల గుడ్లు పొదగవు.
● వేరుశనగలో ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరు కుళ్లు, కాయకుళ్లు తెగుళ్లను నివారించవచ్చు.
కూరగాయ పంటల్లో: ఎకరా టమాటా తోటతో 200 కిలోల వేప పిండి వేయడం వల్ల పూత రాలడం, కాయతొలుచు పురుగులను తగ్గించవచ్చు. టమాటాకు ఆశించే పాము పొడ పురుగు నివారణకు వేప పిండితో తయారు చేసిన 50 శాతం ద్రవణాన్ని మొక్కలు నాటిన 10–15 రోజుల్లో పిచికారీ చేయాలి.
● క్వాలీఫ్లవర్ ఎకరాకు 100 కిలోల వేప పిండి వాడటంతో కులు తెగులు రాకుండా నివారించవచ్చు.
వాణిజ్య పంటల్లో: పత్తిలో ఎకరాకు 50 కిలోల వేప పిండి వాడటం వల్ల వేరుకుళ్లు తెగులును పూర్తిగా అరికట్టవచ్చు. యూరియాలోని నత్రజని ఎక్కువ కాలం అందుబాటులో ఉండి పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాయి.
పండ్ల తోటల్లో: మామిడి, బత్తాయి తోటల్లో 3 కి లోల వేప పిండిని ఏడాది వయసు ఉన్న మొక్కలకు వాడాలి. కాండంతొలుచు, వేరుతొలుచు పురుగులను నివారించుకోవచ్చు. పూత వచ్చే సమయంలో, పిందె సమయంలో 5శాతం వేప ద్రావణం పిచికారీ చేసి చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు.
పూలతోటల్లో: పూలతోటలైన కనకాంబరం, లిల్లీ మల్లె తోటల్లో వేప పిండిని వాడటం వల్ల నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
పాడి–పంట
వేప పిండితో పంటలకు మేలు
వేప పిండితో పంటలకు మేలు