దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం సుమారు పది వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ ఉల్లి కుప్పలతో నిండిపోయింది. వ్యాపారులు అన్ని కుప్పలకు వేలం వేయడానికి సమయం సరిపోలేదు. మధ్యాహ్నం 2 గంటలైనా వేలం ముగియకపోవడంతో చాలామంది రైతులు ఉల్లిని బస్తాల్లో నింపి విక్రయించారు. కొనుగోలుదారులు ఎగబడి ఎవరికి వారే సంచుల్లో నింపుకొని తూకాలు వేయించుకోవడం కనిపించింది. ఓ పక్క వ్యాపారులు, మరోపక్క రైతులు ఉల్లి విక్రయాలు సాగించడంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోయింది.
కాస్త మెరుగ్గా ధరలు..
బుధవారం జరిగిన బహిరంగ వేలంలో ధరలు గత వారం కంటే కొంత వరకు పెరిగాయి. ఉల్లి బాగా ఆరబెట్టడంతో పాటు నాణ్యతగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి వేలం పాడారు. క్వింటా గరిష్టంగా రూ.2,000 పలికింది. ఇది గత వారం కంటే రూ.400 ఎక్కువ. అలాగే కనిష్టంగా రూ.1,400 నమోదుకాగా.. గత వారం కంటే రూ.300 వరకు పెరిగింది.
50 కిలోల బస్తాలుగా మార్పు..
గతంలో మార్కెట్‌యార్డులో నిబంధన పేరుతో 45 కిలోల బస్తా క్వింటా ధరలో సగం ధరకు విక్రయించేవారు. దీంతో వ్యాపారి 5 కిలోల ఉల్లిని నేరుగా దోచుకునే పరిస్థితి ఉండేది. ఈసారి మార్కెట్ నిబంధనలు సవరించి 50 కిలోల బస్తాలుగా తూకం వేశారు. మార్కెట్ అంతా 50 కిలోల బస్తాలే విక్రయించారు. నాణ్యమైన ఉల్లి బస్తా రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు.. రెండోరకం ఉల్లి రూ.500 నుంచి రూ.700 వరకు విక్రయించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు వేలాదిబస్తాల ఉల్లిని కొనుగో లు చేయడంతో వ్యాపారం జోరుగా సాగింది.
క్వింటా గరిష్టంగా రూ. రెండు వేలు.. కనిష్టంగా రూ.1,400