సహాయక చర్యలు వేగవంతం
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో సహాయక చర్యలు చేపట్టడం రోజురోజుకూ సవాల్‌గా మారుతోంది. సొరంగం పైకప్పు కూలిన ఘనట జరిగి 27 రోజులైనా నేటికీ కార్మికుల జాడ లభించలేదు. సొరంగం ప్రమాదంలో దెబ్బతిన్న టీబీఎం మిషన్ భాగాలను తొలగిస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సహాయక సిబ్బందికి పనుల్లో జాప్యం జరుగుతోంది. అయితే గురువారం డీ–1, డీ–2 ప్రదేశాల్లో ఉన్న పెద్దపెద్ద బండరాళ్లను సైతం తొలగించి బయటికి పంపిస్తున్నారు. వీటిని కదిలిస్తుండటంతో నీటి ఊట కూడా భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా భారీ పంపుల ద్వారా నీటిని బయటికి పంపిస్తున్నారు. డీవాటరింగ్ ప్రక్రియతోపాటు బురద, మట్టిని తొలగిస్తూ లోకో ట్రైన్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. దీంతో గతంలో కంటే సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహాయక బృందాలను తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా అభినందించారు.
ఐదు షిఫ్ట్‌ల్లో..
సహాయక చర్యలు ప్రతిరోజు 5 షిఫ్ట్‌లుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు, 11, మధ్యాహ్నం 3, రాత్రి 7, 11 గంటల షిఫ్ట్‌ల్లో ప్రత్యేక సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. సొరంగంలో లోపల జరిగే సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 27 రోజులుగా సొరంగంలో రాత్రి, పగలు పనిచేస్తూ.. ప్రమాద స్థలంలో పేరుకుపోయిన టీబీఎం భాగాలు స్టీల్, బండరాళ్లు, బురదను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. సొరంగంలో ప్రమాద స్థలానికి చేరువలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు తెప్పించిన రోబో సేవలు పదిరోజులైనా అందుబాటులోకి రాలేదు. టీబీఎం శకలాలు పూర్తిగా తొలగిస్తే తప్ప రోబో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
డీ–1, 2 ప్రదేశాల్లో బండరాళ్ల తొలగింపు
భారీ పంపులతో డీవాటరింగ్‌కు చర్యలు
ఒక్కొక్కటిగా సవాళ్లను అధిగమిస్తూ ముందుకు..
27 రోజులుగా శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
ఎస్‌ఎల్‌బీసీలో అందుబాటులోకి రాని రోబో సేవలు
Comments
Please login to add a commentAdd a comment