మిగిలింది 8 రోజులే..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు అంతంత మాత్రంగానే వసూలవుతోంది. వాస్తవానికి నగరాలు, పట్టణాల్లో ఎక్కడైనా ఏదైనా వ్యాపారం నిర్వహించాలంటే నిర్ణీత రుసుం (ఫీజు) చెల్లించి స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటేటా రెన్యూవల్ చేసుకోవడం తప్పనిసరి. ఎవరికి వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించిన తర్వాత అధికారులు సర్టిఫికెట్ అందజేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి సరళీకృత విధానం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండానే ఈ ప్రక్రియ మొత్తం మీ–సేవ ద్వారా నేరుగా పూర్తి చేయవచ్చు. కాగా, జిల్లా కేంద్రంలో 15 వేలకు పైగా వివిధ వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌లో ఐదు వేల లోపు మాత్రమే నమోదు కావడం గమనార్హం. వీటి తనిఖీ, పర్యవేక్షణ బాధ్యతలను మున్సిపాలిటీలోని శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో వీరితో పాటు జవాన్లు సైతం ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం ఎనిమిది రోజులే గడువు ఉంది. వీరు వసూళ్ల లక్ష్యానికి ఎంతో దూరంలో ఉండటం గమనార్హం.
కొత్త విధానం.. వసూళ్లపై ప్రభావం
కొత్త సరళీకృత విధానం అమలులోకి వచ్చాక ఏటా ట్రేడ్‌లైసెన్సు వసూళ్లపై ప్రభావం పడింది. ముఖ్యంగా రెన్యూవల్ చేసుకోవడానికి 11 నెలల ముందుగానే ఏడాదికి సంబంధించిన మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఆయా సంస్థల యజమానులు, నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో పూర్తిస్థాయిలో మున్సిపాలిటీలకు ఆదాయం రావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ముగిసే మూడు నెలల ముందు నుంచి ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది.
● మహబూబ్‌నగర్ నగరంలో 2024–25కు 4,779 సంస్థల నుంచి రూ.82.40 లక్షలు, జరిమానా కింద రూ.23.67 లక్షలతో పాటు పాత బకాయిలు రూ.82.43 లక్షలు, వీటి జరిమానా రూ.41.17 లక్షలు కలిపి మొత్తం రూ.2,29,67,000 రావాలి. అయితే ఇప్పటివరకు 1,538 సంస్థల నుంచి రూ.49.93 లక్షలు, జరిమానా కింద రూ.7.50 లక్షలు, పాత బకాయిల కింద రూ.11.94 లక్షలు, వీటికి సంబంధించి జరిమానా రూ.5.97 లక్షలు కలిపి మొత్తం రూ.75.34 లక్షలు (32.81 శాతం) మాత్రమే వచ్చింది. ఇంకా 3,241 సంస్థల నుంచి రూ.32.47 లక్షలు, జరిమానా కింద రూ.16.17 లక్షలు, పాత బకాయిలు రూ.70.49 లక్షలు, వీటికి సంబంధించి జరిమానా రూ.35.20 లక్షలు కలిపి మొత్తం రూ.1,54,33,000 పెండింగ్‌లోనే ఉంది.
● ఇక 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 4,777 సంస్థలు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండగా.. ఇందు లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ.84.76 లక్షలు, జరిమా నా కింద రూ.51.23 లక్షలు, పాత బకాయిల కింద రూ.1.05 కోట్లు కలిపి మొత్తం రూ.2,40,82,000 రావచ్చని మున్సిపల్ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 263 సంస్థల నుంచి ఫీజు రూ.20.26 లక్షలు, జరిమానా కింద రూ.1.28 లక్ష లు, పాత బకాయిల కింద రూ.2.59 లక్షలు కలిపి మొత్తం రూ.24.13లక్షలు మాత్రమే (10.02శాతం) వసూలైంది. ఇంకా 4,514 సంస్థల నుంచి ట్రేడ్‌లైసెన్స్ ఫీజు రూ.64.50 లక్షలు, జరిమానా కింద రూ.49.95 లక్షలు, పాత బకాయిలు రూ.1,02,25,000 కలిపి మొత్తం రూ.2,16,70,000 రావాల్సి ఉంది.
సాధ్యమైనంత మేరకు వసూలు
నగరంలోని వివిధ సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు రాబట్టడానికి క్షేత్రస్థాయిలో శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది తిరుగుతున్నారు. గడువు దగ్గరపడుతున్నందున ఈ వసూళ్లలో వేగం పెంచుతున్నాం. సాధ్యమైనంత మేరకు లక్ష్యం చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
– డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్
ట్రేడ్‌లైసెన్స్ ఫీజు వసూలు అంతంతే
మహబూబ్‌నగర్ నగరంలో 32.81 శాతమే
రెన్యూవల్ కింద వచ్చింది 10.02 శాతమే
మిగిలింది 8 రోజులే..
Comments
Please login to add a commentAdd a comment