అనుమానాస్పదవ్యక్తులపై నిఘా పెట్టాలి
మహబూబ్‌నగర్ క్రైం: పదో తరగతి పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి సమస్యలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలో భాగంగా శనివారం పోలీస్ లైన్ హైస్కూల్, అపెక్స్, తక్షశిల ఉన్నత పాఠశాలను ఎస్పీ పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరగడానికి ఎస్పీ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ట్రాఫిక్ కట్టడి చేయాలని విద్యార్థుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కేంద్రంలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది, పాఠశాల సిబ్బంది కూడా ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. మహిళ పోలీస్ సిబ్బంది అమ్మాయిలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీసులు తప్పక విధుల్లో ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్‌సీఐ భగవంతురెడ్డి పాల్గొన్నారు.
35 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 60 పరీక్ష కేంద్రాల్లో 12,771 మంది విద్యార్థులకు 12,736 మంది పరీక్షకు హాజరై 35 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ విజయేందిర రెండు, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఒకటి, డీఈఓ ఒకటి, అసిస్టెంట్ కమిషనర్ మూడు, ఫ్లయింగ్ స్క్వాడ్ 26, అబ్జర్వర్ ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సింథటిక్ మ్యాట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడాశాఖకు శనివారం కబడ్డీ సింథటిక్ మ్యాట్లు చేరాయి. 35ఎంఎం సైజు గల 300 మ్యాట్‌లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఒక కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ కబడ్డీ సింథటిక్ మ్యాట్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ సింథటిక్ ట్రాక్‌లు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి కృషితో జిల్లాకు కబడ్డీ సింథటిక్ మ్యాట్‌లు వచ్చినట్లు తెలిపారు. కబడ్డీ మ్యాట్‌పై ప్రాక్టీస్ చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.
కల్తీ ఆహారం అందిస్తే చర్యలు తప్పవు
జడ్చర్ల: హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కల్తీ ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత ఆధికారి మనోజ్ హెచ్చరించారు. శనివారం జడ్చర్లలోని ఓ ఫుడ్ కోర్టును ఆయన తనిఖీ చేశారు. శుక్రవారం ఫుడ్‌కోర్టులో బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక వచ్చిందటూ ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయగా శనివారం విచారణ చేపట్టారు. హోటల్‌లో ఆహార పదార్థాలు, శుభ్రత, తదితర పారిశుద్ధ్యంపై విచారించారు. మటన్ బిర్యానీ, ముడి పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ పరీక్షలలో కల్తీ తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోటళ్లలో నిబంధనల మేరకు వ్యవహరించాలని, వంటశాలలో శుభ్రత పాటించాలనితెలిపారు.
అనుమానాస్పదవ్యక్తులపై నిఘా పెట్టాలి
అనుమానాస్పదవ్యక్తులపై నిఘా పెట్టాలి
Comments
Please login to add a commentAdd a comment