దేవరకద్ర: మండలంలోని అజిలాపూర్ లిఫ్ట్‌కు రూ. 32.05 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి జీఓ కాపీని అందజేశారు. ఈ సందర్బంగా మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం..
ఎన్నికల సందర్బంగా అడవి అజిలాపూర్‌కి సాగునీటిని అందిస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న అడవి అజిలాపూర్‌కు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం చూసి సాగునీటిని గ్రామానికి తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అజిలాపూర్ ఎత్తిపోతలతో గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.