ఆకుకూరలు.. వేసవిలో అనువైన పంటలు
అలంపూర్ : వేసవిలో ఆకు కూరల సాగు రైతులకు కొంత వరకు లాభసాటిగా ఉంటుంది. ప్రజల ఆరోగ్య రక్షణ కల్పించడంతోపాటు రైతులకు లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచిస్తున్నారు. వాటి వివరాలను ఇలా వివరించారు.
అనుకూలమైన ఆకు కూరలు
వేసవిలో ముఖ్యంగా గొంగూర, తోట కూర, పాల కూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా మొదలైన ఆకు కూరలు సాగు రైతులకు మేలు చేస్తాయి. వేసవిలో సాగుకు అనుకులమైన విత్తనాలనే వాడాలి.
తోట కూర :
తోట కూరలో ఆర్‌ఎన్‌ఎ–1 రకం ముఖ్యమైనది. ఆకులు, కాండం లేత ఆకు పచ్చరంగులో ఉంటాయి. విటమిన్ ఏ, సీలు అధికంగా ఉంటాయి. కాండం కూడా పీచు లేకుండా మృదువుగా రుచికరంగా ఉంటాయి. నెల రోజుల్లో ఎకరాకు 5–6 టన్నుల దిగుబడి వస్తోంది. మొదటి కోత ఎత్తిన 15–20 రోజుల్లో వస్తోంది. మొదటి కోత తర్వాత పక్క కోమ్మలు బాగా వస్తాయి. నీటి ఎద్దడిని తెల్ల మచ్చ తెగుళును తట్టుకుంటుంది. ఎకరానికి 800 గ్రాముల విత్తనం అవసరం.
పాల కూర :
పాలకూరలో ఆల్ గ్రీన్ రకం లేత ఆకులు కలిగి 15 నుంచి 20 రోజులకు కోతకు వస్తోంది. 6 నుంచి 7 కోతల్లో ఎకరానికి 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం. విత్తనాలను 20గీ10సెంటీమీటర్ల ఎడంగా, 3–4 సెంటీమీటర్ల లోతు మించకుండా విత్తుకోవాలి. లోతు ఎక్కువైతే మొక్క సరిగ్గా రాదు. విత్తిన 8–10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి.
గొంగూర :
ఎఎన్‌జీఆర్‌యు–1 రకం ప్రధానమైనది. ఎకరానికి 4–5 టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 6 కిలోల విత్తనం అవసరం. ముందుగా 60 సెంటీమీటర్ల ఎడంగా బోదలు చేసుకొని బోదలకు రెండు వైపుల విత్తనాన్ని 30 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో వేయాలి. మొలకెత్తిన 20 రోజులకు వత్తుగా ఉన్న మొక్కలను పీకి కట్టలు కట్టి విక్రయించాలి.
మెంతి కూర :
పూసా ఎర్లీ బంచీంగ్ రకం. ఇది త్వరగా కోతకు వచ్చే రకం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 25 సెంటిమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తుకోవాలి.
కొత్తమీర
సీఎస్–6 రకం పంట కాలం 80 నుంచి 85 రోజులు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. సాధన(సీఎస్–4) రకం పేను బంకను తట్టుకుంటుంది. ఎకరానికి 4 నుంచి 5 కిలోల విత్తనాన్ని 15 సెంటిమీటర్ల ఎడంలో విత్తుకోవాలి. విత్తిన 8–12 రోజుల్లో గింజలు మొలకెత్తుతాయి.
పాడి–పంట
ఎండ నుంచి రక్షణ
ఆకు కూరలు అధిక ఎండలను తట్టుకోలేవు. కాబట్టి వేసవిలో సాగుకు నీడ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. పొలంలో నీడనిచ్చేలా మొక్కజొన్న, ఆముదం పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటుకోవాలి. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల సంఖ్య ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. వేసవిలో నీటి అవసరం ఎక్కువ కాబట్టి స్ప్రింక్లర్ల పద్దతిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment