సహాయక చర్యల్లో పురోగతి
అచ్చంపేట/ మన్ననూర్: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది. టన్నెల్‌లో చిక్కుకున్న వారిలో మరో కార్మికుడి మృతదేహం లభ్యమైంది. 32 రోజుల అన్వేషణ అనంతరం ఇంజినీర్ మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. ఇతన్ని జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటేడ్ (జేపీ) కంపెనీ ఇంజినీర్ మనోజ్‌కుమార్‌గా నిర్ధారించారు. మంగళవారం 13.5 కిలోమీటర్ వద్ద మినీ హిటాచీతో మట్టిని తీస్తుండగా చెయ్యి బయట పడింది. అక్కడ దుర్వాసన రావడంతో స్ప్రే బాటిల్స్ వినియోగిస్తూ ఆ ప్రదేశంలో నాలుగు గంటల పాటు సహాయక సిబ్బంది శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. చేతికి ఉంగరం, గడియారం బట్టి మనోజ్‌కుమార్‌గా తోటి కార్మికులు నిర్ధారించారు. కాడవర్స్ డాగ్స్ చూపిన ప్రదేశంలో కాకుండా లోకో ట్రైన్ పట్టాల మధ్య మృతదేహం లభించినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ బదావత్ సంతోష్ బాధిత కుటుంబానికి ప్రభుత్వ తరపున రూ.25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ వద్ద పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగార్మ్ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్‌కు భార్య స్వర్ణలత, కుమారుడు ఆదర్శ్, కుమార్తె శైలజ, తల్లి జమునాదేవి ఉన్నారు.
అయితే కొంచెం అటు ఇటుగా మిగతా కార్మికుల మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా వారి ఆచూకీ లభించే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు మిగతా ఆరుగురి కార్మికుల ఆచూకీ గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
తాజాగా మరో మృతదేహం లభ్యం
32 రోజుల అన్వేషణలో రెండు మృతదేహాల గుర్తింపు
పోస్టుమార్టం కోసం నాగర్‌కర్నూల్‌కు తరలింపు
మిగతా ఆరుగురి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సహాయక చర్యల్లో పురోగతి
Comments
Please login to add a commentAdd a comment