అమరచింత/గద్వాల క్రైం: సీసీ కెమెరాలను వినియోగించి నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నిఘా నేత్రాల ఏర్పాటుపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నామని డీజీపీ డా.జితేందర్ అన్నారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో పర్యటించారు. అమరచింత మండలంలోని మస్తీపురంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను, వనపర్తిలోని సాయుధదళ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు పలు పోలీస్‌ష్టేషన్ల భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో పోలీసు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జూరాలప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుతో అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను నియంత్రించే అవకాశం ఉందని తెలిపారు. గద్వాల, అలంపూర్ సెగ్మెంట్‌లలో ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులపై ప్రత్యేక బృందం విచారణకు శ్రీకారం చుట్టిందన్నారు. యువ త బెట్టింగ్ యాప్‌ల ద్వారా తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్న ఘటనలు ప్రతి చోట వెలుగులోకి వస్తున్నాయని.. ఈ కేసుల విచారణకు సీట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నడిగడ్డలో నమోదైన బెట్టింగ్ కేసుల నివేదికలను అందించాలని డీజీపీ ఆదేశించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో నిషేధిత మత్తు పదార్థాలు, ఇసుక, రేషన్ బియ్యం, మట్టి, నకిలీ విత్తనాలు, గంజాయి, గుట్కా తదితర మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. కృష్ణా, తుంగభద్ర నదీ తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు నిఘా పెంచాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్, ఐజీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీలు పాల్గొన్నారు.
డీజీపీ డా.జితేందర్