కొత్తకోట రూరల్: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారి 44పై చోటుచేసుకొంది. లారీ డ్రైవర్ శివ తెలిపిన వివరాలు.. బెంగుళూర్ నుంచి ద్రాక్ష పండ్లను లోడ్ చేసుకొని కశ్మీర్‌కు వెళ్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట సమీపంలోకి రాగానే కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. లారీ రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవర్లు శివ, కృష్ణతో పాటు ద్రాక్షపండ్ల యజమాని స్వామికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసునని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ఆనంద్ తెలిపారు.