
రిజర్వాయర్ భూసర్వేను అడ్డుకున్న రైతులు
బల్మూర్: మండలంలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర ప్రాజెక్టు సర్వే పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా తమకు నష్టం కలిగించే ప్రాజెక్టుపై ఏడాదిగా పోరాటం చేస్తున్న తమతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్చించకుండా పరిహారాలు ఇవ్వకుండానే భూసర్వే చేయడం ఏమిటని వారు సర్వే సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈసందర్భంగా మైలారం–అంబగిరి రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై కోర్టులో కేసు ఉన్న కూడా నిబంధనలు పాటించకుండా సర్వే చేయడంపై రైతులు మండిపడ్డారు. గతంలో రెండు సార్లు సర్వే పనులను అడ్డుకున్నా మళ్లీ సర్వే చేయడం తగదని, మరోసారి సర్వేకు వస్తే దాడులు తప్పవని రైతులు సర్వే సిబ్బందిని హెచ్చరించారు. దీంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతు నాయకులు తిరుపతయ్య, శివశంకర్, కృష్ణయ్య, రాజేష్, కాగుల మల్లయ్య, శ్రీశైలం,తో పాటు బల్మూర్, అనంతవరం గ్రామానికి చెందిన భూనిర్వాసిత రైతులు పాల్గొన్నారు.
సర్వే సిబ్బందితో వాగ్వాదం
మరో సర్వేకు వస్తే దాడులు తప్పవు: రైతులు