
48 రోజులైనా.. దొరకని ఆచూకీ
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. ఆరుగురి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది 48 రోజులుగా శ్రమిస్తున్నాయి. సొరంగం లోపల 13.730 కిలోమీటరు నుంచి 13.800 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపునకు గురువారం లోకో ట్రైన్‌లో కన్వేయర్ బెల్టు, ఇతర సామగ్రిని తరలించారు. అత్యంత ప్రమాదకరమైన 13.936 కిలోమీటరు ప్రదేశంలో 45 మీటర్ల వరకు కంచె నిర్మించారు. ఈ ప్రదేశంలో టీబీఎం ఎర్త్ కట్టర్ శిథిలాల కింద కూరుకుపోయింది. 13.800 మీటర్ల వద్ద సహాయక సిబ్బంది తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి వరకు కన్వేయర్ బెల్టు పొడిగించి మట్టి, బురద, రాళ్లు బయటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి, బురద తొలగించే క్రమంలో నీరు ఉబికి వస్తోంది. నిమిషానికి 10 వేల లీటర్ల నీరు వస్తుండటంలో భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. శిథిలాల కింద టన్నుల కొద్ది స్టీల్, కూలిన కాంక్రీట్ సెగ్మెంట్లు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నా.. సహాయక సిబ్బంది వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. వారంలో శిథిలాల తొలగింపు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
కన్వేయర్ బెల్టు పొడిగిస్తున్నాం..
సొరంగ ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు. గురువారం సొరంగం ఇన్‌లెట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక చర్యల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాద ప్రదేశం వరకు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్యం కలిగిన మోటార్లతో బయటకు తరలిస్తున్నామని, సహాయక బృందాలు పూర్తిస్థాయిలో సమన్వయంతో పనులు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్ సంజయ్‌కుమార్ సింగ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
ఆటంకాల నడుమ కొనసాగుతున్న సహాయక చర్యలు
వారంలో శిథిలాల తొలగింపునకు యత్నిస్తున్న సిబ్బంది