
ఎస్‌ఎల్‌బీసీ @ 50 రోజులు
నిషేధిత ప్రదేశంలో..
సొరంగం పైకప్పు కూలిన 13.936 కిలోమీటరు డీ–1 వద్ద సుమారు 40 మీటర్ల వరకు సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రదేశాన్ని నిషేధిత(డేంజర్ జోన్) ప్రాంతంగా గుర్తించారు. నిషేధిత ప్రదేశం దాటి ముందుకు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే మిగిలిన 40 మీటర్ల ప్రాంతం పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సొరంగం ప్రమాద ధాటికి 125 మీటర్ల పొడవు 1,500 టన్నుల బరువు కలిగిన టన్నెల్ బోరింగ్ మిషన్ సుమారు 50 మీటర్ల వెనక్కి వచ్చింది. సొరంగం తవ్వకాలకు అడ్డంగా ఉన్న టీబీఎం స్టీల్ భాగాలను దక్షిణమధ్య రైల్వే సిబ్బంది ప్లాస్మా కట్టర్‌తో కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు, బురద, టీబీఎం భాగాల తొలగింపు, డీవాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతోంది. నిషేధిత ప్రదేశం వరకు యుద్ధ ప్రాతిపదికన మట్టి, బురద తొలగింపు పనులు త్వరితగతిన ముగించాలని సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నిపుణుల సలహాల మేరకు ప్రమాద ప్రదేశం వద్ద చేపట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
● కార్మికుల ఆచూకీ కోసం సహాయక సిబ్బంది నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి అన్నారు. శనివారం సొరంగం ఇన్‌లెట్ వద్ద జేపీ కార్యాలయంలో సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తవ్వకాలకు ఆటంకంగా ఉన్న సమస్యలను అధి గమిస్తూ వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మట్టి తవ్వకాలు జరుపుతూ కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం భాగాలను లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటకు చేరవేస్తున్నామన్నారు. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా పంపింగ్ చేస్తూ బయటకు తోడేస్తున్నామన్నారు.
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలు 50 రోజులకు చేరాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ద్వారా తవ్వకాలు చేపడుతున్న క్రమంలో ఫ్రిబవరి 22న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా.. మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్, 25న ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్‌కుమార్ మృతదేహాలను గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఆరుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా రెస్క్యూ సిబ్బంది వాటిని అధిగమిస్తూ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా మిగిలిన వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది.
రోబోల సేవలు ఎక్కడ?
సొరంగం లోపల అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు గత నెల 11న తీసుకొచ్చిన రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. మానవులు చేయలేని పనులను రోబోలు చేస్తాయని, వీటిని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో రూ.4 కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన రోబోలు నెలరోజులు దాటినా ఇంత వరకు కనీసం సొరంగం లోపలికి కూడా వెళ్లలేకపోయాయి. రోబో యంత్రాలు సొరంగం ఇన్‌లెట్ వద్ద వృథాగా పడి ఉన్నాయి. ఐదురోజుల పాటు ప్రయత్నించిన అటానమస్ పవర్డ్ హైడ్రాలిక్ రోబోల అనుసంధానంగా వ్యాక్యూమ్ పంపు, వ్యాక్యూమ్ ట్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా వాటి పనితీరు నిలిచింది. మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు తీసుకొచ్చిన రోబో యంత్రం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. టీబీఎం స్టీల్ భాగాలు అడ్డుగా ఉండటంతోనే వీటి సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప అత్యంత ప్రమాద ప్రదేశానికి రోబోలు వెళ్లలేవనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచే సే రోబో ముందు భాగంలో ఉన్న గ్రైండర్ పెద్ద పె ద్ద రాళ్లు, శిథిలాలను ముక్కలు చేయడంతోపాటు బురద, మట్టిని వ్యాక్యూమ్ పంపు సాయంతో నేరు గా కన్వేయర్ బెల్టుపై వేస్తోంది. ప్రస్తుతం ఐ దు ఎస్కవేటర్లు (హిటాచీలు) సహాయంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు.
టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
నేటికీ లభించని ఆరుగురి కార్మికుల ఆచూకీ