
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
మానవపాడు: వడదెబ్బకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మానవపాడు మండలం చెన్నిపాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చెన్నిపాడు గ్రామానికి చెందిన తిరుపాలు (58) మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ భాస్కర్, ఏపీఓ విజయశంకర్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి బుధవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య చిట్టెమ్మ, కుమారులు చిరంజీవి, రాజేశ్, కూతురు అనిత ఉన్నారు. తిరుపాలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
మానవపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రం సమీపంలోని ఎన్‌హెచ్–44పై బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్ వివరాల మేరకు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారూరు గ్రామానికి చెందిన కాశీనాథ్ నాయుడు (32) కర్నూలులోని ఆటో షారూంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం కర్నూలు నుంచి పెద్దమారూరుకు బైక్‌పై వెళ్తుండగా.. మానవపాడు స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు అతడిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య గాయత్రి, కొడుకు, కూతురు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మృతదేహం లభ్యం
రాజాపూర్(బాలానగర్): ప్రమాదవశాత్తు చెరువులో పడి రెండు రోజుల క్రితం గల్లంతైన యాదయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. మండలంలోని మోతిఘనాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గంగధర్‌పల్లి గ్రామానికి చెందిన శివకుమార్, యాదయ్యలు గల్లంతుకావడంతో మంగళవారం శివకుమార్ మృతదేహం లభ్యం కాగా, ఈరోజు యాదయ్య మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ తెలిపారు.
తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి గాయాలు
మన్ననూర్: తేనెటీగల దాడిలో గొర్రెల కాపరికి తీవ్రగాయాలైన ఘటన మన్ననూర్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్‌కు చెందిన గొర్రెలకాపరి నోముల ఎల్లయ్య రోజు మాదిరిగా తన గొర్రెల మందను మేత కోసం మన్ననూర్ సమీపంలోని నీరంజన్ షావలి దర్గా సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చెట్టుకు ఉన్న తేనె తుట్టెలోని తేనెటీగలు ఒక్కసారిగా ఎల్లయ్యపై దాడి చేశాయి. గమనించిన తోటి గొర్రెల కాపరులు అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి