
‘సోనియాగాంధీపై ఆరోపణలు తట్టుకోలేకపోయా’
వనపర్తి టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాహుల్‌గాంధీ బ్రాండ్ ఇమేజ్ రాజకీయాలకు భయపడుతూ ఆక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తోందని, మోదీ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ చార్జిషీట్ వేయడాన్ని నిరసిస్తూ గురువారం వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో చిన్నారెడ్డి పాల్గొని మాట్లాడారు. విలువలు, నిజాయితీ కలిగిన రాజకీయాలకు సోనియాగాంధీ పెట్టింది పేరని, ఆమైపె చార్జీషీటు వేయడాన్ని తట్టుకోలేకపోయానని చిన్నారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. సోనియాగాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారన్నారు. నేషనల్ హెరాల్డ్‌ను రుజువులు లేకుండా లాగుతున్నారని, పుష్కరకాలం నాటి హెరాల్డ్ కేసులో ఒక్క పైసా కూడా మార్పిడి జరగలేదని చెప్పారు. న్యాయస్థానంలో ఈడీకి, కేడీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వేణు, సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.