
అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..
● ఇంటర్ ఫస్టియర్‌లో ఉత్తీర్ణత
సాధించిన మల్లెందొడ్డి విద్యార్థి
మల్దకల్: ఇంటర్‌లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో మల్దకల్ మండలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థి తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనవసర భయమే తమ బిడ్డ ప్రాణం తీసిందని వాపోయారు.
తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
రాజోళి: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజోళి మండలం మాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మాన్‌దొడ్డికి చెందిన నడిపి ఆంజనేయులు (52) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. ప్రస్తుతం తాటిముంజల సీజన్ కావడంతో, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో తాటికాయలు తెంచేందుకు చెట్టుపైకి ఎక్కిన ఆయన.. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.