‘ఉపాధి’ కూలీలకు ‘భరోసా’
● వ్యవసాయ కూలీలు అర్హులు ● పని చేసిన వారికే పైకం
దండేపల్లి: జిల్లాలో ప్రజాపాలన గ్రామసభలు ఇటీవల ముగిసాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అర్హుల జాబితా ప్రకటించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం జాబితాలో చోటు దక్కని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద ఉపాధి హామీ పథకంలోని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.16వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మండలానికో గ్రామం ఎంపిక చేయగా.. 16గ్రామాల్లోని 639మంది కూలీలకు మొదటి విడతగా రూ.6వేల చొప్పున ఖాతాల్లో జమ చేశారు.
జిల్లాలో..
జిల్లాలోని 311 గ్రామ పంచాయతీల్లో 1,21,067 జాబ్‌కార్డులు ఉండగా.. 2,55,151మంది కూలీ లు పని చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉపాధి హామీ కూలీల వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 15,332 మంది జాబితాను సిద్ధం చేయగా పరిశీలన అనంతరం వివిధ కారణాలతో 400 మంది తిరస్కరణకు గురయ్యారు. 14,880 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎంపిక చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో కొత్తగా 2,714 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటిని కూడా అధికారులు మళ్లీ పరిశీలన చేయనున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులపాటు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లినవారై ఉండాలి. ఒక్కగుంట కూడా సాగుభూమి ఉండకూడదు. భూమిలేని వ్యవసాయ కూలీలే ఈ పథకానికి అర్హులు.
దరఖాస్తులు పరిశీలిస్తున్నాం..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారుల జాబితా రూపొందించాం. జాబితాలో పేర్లు లేని వారు ఇటీవల జరిగిన గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన చేసి అర్హులకు పథకాన్ని వర్తింపజేస్తాం.
– కిషన్, డీఆర్డీవో మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment