ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి
● ఈ నెల 20లోగా పూర్తి చేయాలి ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలి
బెల్లంపల్లి: ప్రభుత్వ శాఖల అధికారులు సమష్టిగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయం, డంపింగ్ యార్డు, కన్నాలలోని అమృత్ 2.0 పనులను ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్‌ఆర్‌ఎస్–2020లో వ చ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ దరఖాస్తులను ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డుల్లో ప్రతీ రోజు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని, బయోమైనింగ్ నిర్వహణపై సూచనలు చేశారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో రూ.10 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని వార్డుల్లో నిరంతరాయంగా ప్రతీరోజు తాగునీటి సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని, వేసవికాలం సమీపిస్తున్నందున తాగునీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
కన్నెపల్లి మండలంలో పర్యటన
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో, ప్రాథమిక పాఠశాలలోని సౌకర్యాలను కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. వివిధ ధ్రువపత్రాల కోసం మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన స్థలం, చర్లపల్లి ప్రాథమిక పాఠశాల పరిశీలించారు.
అంగన్‌వాడీ స్థలం పరిశీలన
బెల్లంపల్లిరూరల్: మండలంలోని లంబాడితండా గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పరిశీలించారు. గ్రామీణులకు అనువుగా ఉండే ప్రాంతంలో భవనాన్ని గడువులోగా నిర్మించి సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment