అటవీశాఖ ఆంక్షలపై ఆందోళన చేస్తాం
● మండల పరిరక్షణ కమిటీ సభ్యులు ● జన్నారంలో రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాలు
జన్నారం: మండల రహదారి మీదుగా వాహనాల రాకపోకలపై అటవీశాఖ ఆంక్షలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని మండల పరిరక్షణ కమిటీ సభ్యులు హెచ్చరించారు. మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో సామాజిక కార్యకర్తలు, పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల అధ్యక్షులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుల, వర్తక, వ్యాపార సంఘాలు, మేధావులతో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం జన్నారం వాసి మోబీన్‌పై దాడి చేసిన అటవీ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. వాహనాల రాకపోకలపై అటవీశాఖ విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చెక్‌పోస్టుల వద్ద స్థానికులమని ఆధార్ కార్డు చూపించి రావాలని ఎమర్జెన్సీ పరిస్థితిని తెస్తున్నారని ఆరోపించారు. మండల వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించి సోమవారం నుంచి ఆందోళనలు తీవ్రతరం చేయడానికి నిర్ణయించారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు భరత్‌కుమార్, మాజీ ఎంపీటీసీ రియాజొద్దీన్, కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, సుభాష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి తిరుపతి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి అజ్మత్‌ఖాన్, సీపీఎం నాయకులు లింగన్న, సామాజిక కార్యకర్తలు భూమాచారి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment