గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
గోండుగూడ వద్ద మరొకరు..
కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి..
తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్‌బంక్ వద్దకు బైక్‌పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..
సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలోని సోన్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పడుతున్న క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు.
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment