అరకొరగా పౌష్టికాహారం
● అంగన్‌వాడీ కేంద్రాలకు సరకుల సరఫరాలో జాప్యం ● గత నెల నుంచి రాని కందిపప్పు ● చిన్నారుల్లో పౌష్టికాహార లోపం
మంచిర్యాలటౌన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా.. అందుకు అవసరమైన సరుకుల సరఫరాలో ప్రతీనెల జాప్యం జరుగుతోంది. దీంతో పిల్లల ఎదుగుదల, పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉంది. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్ అందించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా.. ఒక్కో నెలలో కేంద్రాలకు సరఫరా కావడం లేదు. గత నెలలో కందిపప్పు సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారులకు అందించలేదు. రేషన్ బియ్యం గోదాముల నుంచి నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉండగా.. గత నెలలో కొన్ని కేంద్రాలకు బియ్యం కూడా సరఫరా చేయలేదు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. కేంద్రాల్లో ప్రతీ రోజు మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాల్సి ఉంటుంది. గత నెల నుంచి పప్పు సరఫరా కాకపోవడంతో కూరగాయల భోజనం పెట్టాలన్నా టమాటా మినహా మిగతా వాటి ధరలు అధికంగా ఉండడం టీచర్లకు భారంగా మారుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిల్వ ఉన్న పప్పు కూడా అయిపోవడంతో అధిక ధరకు కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మాతాశిశు మరణాల నివారణకు సరైన పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో జిల్లాలోనే పాలు, పప్పు టెండర్లు నిర్వహించి సరఫరా చేసేవారు. కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయిలోనే టెండర్లు నిర్వహించి సరఫరా చేస్తున్నారు. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సరుకుల సరఫరాకు టెండర్లు నిర్వహిస్తుండగా.. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరడంతో టెండర్ ప్రక్రియ ఆలస్యమైతే సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని కేంద్రాలకు చిన్న కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పోషకాలు అందడం లేదు.
నెల నెల సరఫరా చేస్తేనే..
జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరేళ్లలోపు చిన్నారులు 45,455 మంది, 4,245 మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు ప్రతీరోజు మధ్యాహ్నం పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నారు. ఎ క్కువగా పప్పు, ఆకుకూరలతో భోజనం వడ్డిస్తున్నారు. కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం వాటిపై ‘అంగన్‌వాడీ గుడ్డు–తెలంగాణ ప్రభుత్వం’ అనే ముద్ర వేస్తోంది. మొదటి విడతలో నీలం రంగు, రెండో విడత ఎరుపు రంగు, మూడో విడతలో ఆకుపచ్చ రంగుతో ముద్ర వేసి సరఫరా చేస్తున్నారు. ముద్రల వల్ల కోడిగుడ్ల పంపిణీ జరిగిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మూడు విడతల గుడ్లను నెలలో ఒ క్కసారే ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కోడిగుడ్లు, పాలు, కందిపప్పు, బాలా మృతం ప్రతినెలా ఆయా కేంద్రాలకు సరిపడా స రఫరా చేస్తే లబ్ధిదారులకు సకాలంలో అంది పౌ ష్టికాహారంతో కూడిన ఆహారం పొందే వీలుంది.
సరఫరాకు ఇబ్బంది లేదు
అన్ని కేంద్రాలకు కందిపప్పును రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. రేషన్ బియ్యం నేరుగా గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. కొందరు టీచర్లు కందిపప్పు స్టాక్ ఉందని చెబితే ఆయా కేంద్రాల్లో వేయడం లేదని తెలిసింది. లబ్ధిదారులకు ప్రతినెలా సరిపడా సరుకులు కేంద్రానికి చేరేలా టీచర్లు చూడాలని, ఎక్కడైనా సరుకులు రాని పక్షంలో సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు తెలపాలని చెబుతున్నాం. కొన్ని కేంద్రాల్లోనే సమస్య ఉన్నట్లు తెలిసింది. లబ్ధిదారులకు సరిపడేలా సరుకులను అందించేలా చూస్తాం. పౌష్టికాహారం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
అరకొరగా పౌష్టికాహారం
Comments
Please login to add a commentAdd a comment