ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై చర్యలు
● 10 నుంచి ప్రజావాణి ప్రారంభం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీలు, తహసీల్దార్లు, సీఐలు, ఎస్సైలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10న తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులపై పోలీస్, రెవెన్యు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత కనీసం 15 రోజులు, గరిష్టంగా 21రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యలపై అర్జీదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బెదిరింపులు, ఆందోళనలు చేపట్టే వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
ఎన్నికల అధికారితో కలెక్టర్ భేటీ
శ్రీరాంపూర్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణికుముదిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆమెను సీసీసీలోని సింగరేణి గెస్టుహౌజ్‌లో బుధవారం కలిసి పూల మొక్కను అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై చర్చించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment