
కొలువుల సాధనలో మేటి అశోక్
● చదివిన కళాశాలలోనే జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం
కాసిపేట: కష్టపడి చదివి నాలుగు ఉద్యోగాలు సాధించడంతో పాటు తాను విద్యను అభ్యసించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే జేఎల్‌గా ఉద్యోగం సాధించాడు జిల్లాకు చెందిన పెద్ది అశోక్. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండపూర్‌కు చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పెద్ది పెంటయ్య, మధునమ్మ దంపతుల కుమారుడు అశోక్ 2012లో ఫారెస్టు బంగ్లా వాచర్ పరీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి ర్యాంకుతో ఉద్యోగం సాధించాడు. కొలువు చేస్తూనే 2016లో ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగో ర్యాంకు సాధించాడు. 2024లో జరిగిన గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించి నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వెలువడిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాల్లో హిస్టరి సబ్జెక్టులో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించి బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నాడు. తాను ఇంటర్ చదివిన కాసిపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఎల్‌గా పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు. 1 నుంచి పదోతరగతి వరకు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన అశోక్ ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాసిపేటలో సీఈసీ, డిగ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచిర్యాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. కాగా పీజీ ఎంట్రెన్స్‌లో సైతం మూడవ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నాడు. ఉద్యోగాల సాధనలో పట్టుదలతో ముందుకు వెళ్లడంతోనే విజయం సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్‌లో గ్రూప్1 సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తానని, అందుకు ప్రిపరేషన్ ప్రారంభించనున్నట్లు అశోక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment