పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, డీఈవో యాదయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, నలుగురు సీ సెంటర్ కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, అంతరాయం లేకుండా విద్యుత్, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఐదు రూట్లు ఏర్పాటు చేశామని, ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అంజయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment