
● పోలీసుల సేవలో మానవత్వం ● వివిధ కార్యక్రమాలతో ప్రజలతో
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా పోలీసులు కాఠిన్యాన్ని వీడి కారుణ్యంతో ప్రజలతో మమేకమవుతున్నారు. సాధారణంగా పోలీసులంటే కఠినత్వమే గుర్తొస్తుంది, ఠాణా మెట్లెక్కడానికి జంకుతారు. కానీ, శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా ఉన్నప్పటికీ, తమలోని మానవత్వాన్ని జిల్లా పోలీసులు సేవా కార్యక్రమాల ద్వారా చాటుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నాయకత్వంలో ‘విలేజ్ పోలీస్ ఆఫీసర్స్’ వ్యవస్థను ప్రవేశపెట్టి, ప్రజలకు స్నేహహస్తం అందించేందుకు సిద్ధమవుతున్నారు. గిరిజన, మావోయిస్ట్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలతో ప్రజాచైతన్యానికి కృషి చేస్తున్నారు. గతేడాది నుంచి 3 మెడికల్ క్యాంపులు, 4 రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 2022లో 200 యూనిట్ల రక్తదానం చేసినందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుంచి అవార్డు అందుకున్నారు. యువత సన్మార్గంలో నడవాలని క్రీడాసామగ్రి అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. డీసీపీ భాస్కర్ మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, ‘‘మీ భద్రత, బాధ్యత మాదే’’ అంటూ భరోసా కల్పిస్తున్నారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో దర్బార్‌లతో సమస్యలను పరిష్కరిస్తూ, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంచుతున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
● మార్చి 12న రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను డీసీపీ భాస్కర్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
● మార్చి 15న మాదారం పరిధిలో 365 గిరిజన కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు, క్రీడాసామగ్రి అందించారు.
● 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లు స్థాపించిన మిలీనియం వెల్ఫేర్ సొసైటీ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.3.63 లక్షల సాయం చేశారు.
● 2024 అక్టోబర్‌లో అమరవీరుల సంస్మరణలో 200 యూనిట్ల రక్తదానం చేశారు.
● ఖాకీలో కనిపించే ఈ మానవత్వం ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని బలపరుస్తోంది.
భరోసా కల్పిస్తున్నాం
పోలీసులు కూడా సమాజంలో భాగస్వాములే. ‘కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా పోలీసులంటే ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగింపజేస్తున్నాం. శాంతిభద్రతలను కాపాడడంతోపాటు ఆపదసమయంలో మేమున్నామని భరో సా కల్పిస్తున్నాం. యువత పెడదోవ పట్ట కుండా చర్యలు తీసుకుంటున్నాం.
– భాస్కర్, డీసీపీ మంచిర్యాల