సేంద్రియ సాగు.. భేష్‌! | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగు.. భేష్‌!

Published Mon, Apr 14 2025 12:24 AM | Last Updated on Mon, Apr 14 2025 12:24 AM

సేంద్

సేంద్రియ సాగు.. భేష్‌!

● స్వయంగా గోశాల ఏర్పాటు ● సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగు ● పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్న యువరైతు సతీశ్‌

చెన్నూర్‌రూరల్‌: రసాయనిక ఎరువులకు స్వస్తిచెప్పి సహజ సిద్ధమైన ఎరువులను తయారుచేస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలంలోని శివలింగాపూర్‌కు చెందిన యువరైతు గోనె సతీశ్‌. ఇంటి వద్దే ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేస్తున్నాడు. ఇందుకు ఆవుపేడ, ఆవు మూత్రం వాడుతున్నాడు. తనకున్న 20 గుంటల భూమిలో సేంద్రియ ఎరువులతో 18 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.

గోశాల ఏర్పాటు...

మూడేళ్ల క్రితం ఇంటివద్ద షెడ్డు నిర్మించి ఒక్క ఆవుతో గోశాల ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం గోశాలలో 120కి పైగా ఆవులు ఉన్నాయి. ఆవుల పేడతో ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. వారికి అతితక్కువ ధరకు ఎరువులు అందజేస్తున్నాడు. అంతేకాకుండా ఆవు పేడతో పిడకలు తయారుచేసి హోమాలకు, యజ్ఞాలకు అందజేస్తున్నాడు.

కూరగాయల సాగు...

ఇంటి వద్ద 20 గుంటల భూమిలో బీర, పూదీన, గ్రామ సమీపంలో ఐదెకరాల చేను కౌలుకు తీసుకుని మూడు రకాల వంకాయలు, సోరకాయలు సాగు చేస్తున్నాడు. వంకాయలు రోజుకు ఏడు నుండి ఎనిమిది క్వింటాళ్ల వరకు, సోరకాయలు, బీర కాయలు కలిపి రోజుకు రెండు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నాయి. వాటిని హోల్‌సేల్‌గా విక్రయించి ఆదాయం పొందుతున్నాడు. భార్య రజిత, తమ్ముడు భాస్కర్‌ సహకారం అందిస్తున్నారు.

పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు

సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్న సతీశ్‌ను పలు సంస్థలు ఉత్తమ రైతుగా ఎంపిక చేసి పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశాయి. 2021లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అప్పటి కలెక్టర్‌ భారతి హోలీకేరి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. 2022లో సుస్థిర వ్యవసాయ రాష్ట్రస్థాయి రైతు చైతన్య సదస్సులో హైదరాబాద్‌లో పుడమి పుత్ర అవార్డు, నేషనల్‌ ప్రీమియర్‌ అవార్డుకు ఎంపికయ్యి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. 2024లో హైదరాబాద్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సహస్ర కంపెనీ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నాడు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లాలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌ హైదరాబాద్‌ వారి చేతుల మీదుగా పుడమి పుత్ర పురస్కారం అందుకున్నాడు. సతీశ్‌ తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులు, గోశాల, కూరగాయల సాగును బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించారు.

పుడమితల్లిని కాపాడేందుకు..

నేను 18 ఏళ్లుగా సేంద్రియ ఎరువు తయారుచేస్తూ కూరగాయలు సాగు చేస్తున్నా. 120 ఆవులతో గోశాల ఏర్పాటు చేశా. పశువుల పేడతో పిడకలు కూడా తయారు చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి పుడమి తల్లిని కాపాడేందుకు సేంద్రియ ఎరువులు వాడాలి.

– గోనె సతీశ్‌, రైతు, శివలింగాపూర్‌, చెన్నూర్‌

సేంద్రియ సాగు.. భేష్‌!1
1/3

సేంద్రియ సాగు.. భేష్‌!

సేంద్రియ సాగు.. భేష్‌!2
2/3

సేంద్రియ సాగు.. భేష్‌!

సేంద్రియ సాగు.. భేష్‌!3
3/3

సేంద్రియ సాగు.. భేష్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement