
గాలి వీచినా కరెంట్ కట్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈదురుగాలులు వీచినా.. చిన్నపాటి వర్షం కురిసినా కరెంటు సరఫరా నిలిచిపోతోంది. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. గత నెల 22న జిల్లాలో ఈదురుగాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 3న ఈదురుగాలులు, వర్షానికి గంటల తరబడి సరఫరా నిలిచిపోయింది. 10న ఈదురుగాలులు, చిన్నపాటి వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పునరుద్ధరణకు గంటల తరబడి సమయం పడుతోంది. నెలకు రెండు మూడు రోజులు విద్యుత్ మరమ్మతులు, ఆధునీకరణకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిపి వేస్తున్నారు. అధిక లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల మార్పు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ తీగలు, స్తంభాలు, కాసారం, ఫీడర్లు, అధునాతన, సాంకేతిక తదితర పరికరాలు కొత్తవాటిని ఏర్పాటు చేసి మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు తరచూ మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా గాలివానకు సరఫరా నిలిచిపోయి గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మారుమూల గ్రామాల్లోనే కాదు జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి ఎదురవుతోంది.
రైతులకూ ఇబ్బందులే..
జిల్లాలో 3,60,214 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. బిల్లుల వసూలు కచ్చితంగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. యాసంగి వరి పంటల సాగుకు బోరు మోటార్ల వినియోగం పెరిగింది. దిగుబడి దశలో ఉన్న పంటలకు నీరందిస్తుండగా సరఫరా నిలిచిపోతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. మరమ్మతుల పేరిట సరఫరా నిలిపి వేస్తుండడంతో ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా అప్రకటిత కోతలు విధిస్తున్నారని కాలనీల వాసులు వాపోతున్నారు. ప్రతీ నెల రెండో శనివారం విద్యుత్ మరమ్మతుల డే కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిపి వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో సేవల్లో ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో రోజు రోజుకు విద్యుత్ వినియోగదారులు పెరుగుతుండడం, రూ.కోట్లలో బిల్లులు వసూలవుతున్నా అందుకు అనుగుణంగా సేవలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై ఫోన్ చేస్తే కొందరు ఏడీ, ఏఈ, సిబ్బంది స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
గంటలకొద్దీ ఎదురు చూపులు
తరచూ మరమ్మతులు.. ఆగని అవాంతరాలు