వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు
కలెక్టర్ రాహుల్‌రాజ్
పాపన్నపేట(మెదక్): వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం ఎస్‌ఈ శంకర్‌తో కలసి మిన్‌పూర్ 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొదట కుర్తివాడ గ్రామానికి వెళ్లారు. అక్కడ విద్యుత్ సరఫరా అవుతున్న తీరును రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రానున్న వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయని కొనియాడారు. మిన్‌పూర్ సబ్‌స్టేషన్ ద్వారా జిల్లాలో పద్దెనిమిది సబ్‌స్టేషన్లకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బ్రేకర్లు, రికార్డులు, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా టోల్‌ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆయన వెంట డీఈ భాషా, ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తాగునీటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, ఉపాధి కూలీలకు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అనంతరం పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ తదితర కులవృత్తుల లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment