
సన్నబియ్యం సన్నద్ధం
బయట విక్ర యానికి బ్రేక్!
మెదక్‌జోన్: ఆహార భద్రత కార్డులున్న పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని 80శాతం మంది తినలేదు. కేవలం 20 శాతం మాత్రమే తిన్నారు. రేషన్ షాపుల ద్వారా ఉచితంగా తీసుకొని బయట అమ్ముకున్నారు. కానీ ఇక నుంచి పంపిణీ చేసే సన్న బియ్యాన్ని లబ్ధిదారులందరూ తిననున్నారు.
జిల్లాలో రెండు లక్షల పై చిలుకు రేషన్ కార్డులు
మెదక్ జిల్లాలో 2,14,155 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో ఆహార భద్రత కార్డులు 2,00,229, అంత్యోదయ కార్డులు 13,860, అన్నపూర్ణ కార్డులు 66 ఉండగా వీటికీ నెలకు 4367.538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 520 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సన్న బియ్యం పథకాన్ని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చౌకధరల దుకాణం ద్వారా ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా ఎంఎల్‌ఎస్ పాయింట్లలో బియ్యం సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
వానాకాలంలో 1.5 లక్షల ఎకరాల్లో సాగు
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.73 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా అందులో 1.5 లక్షల ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వడంతో ఎక్కువ మొత్తంలో సన్నాల సాగుకు రైతులు మొగ్గు చూపారు. కాగా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 93 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 53,660 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం సేకరించారు. సీఎంఆర్ కోసం పలు రైస్‌మిల్లర్లకు ధాన్యం ఇవ్వగా ఇప్పటి వరకు 80 శాతం బియ్యాన్ని మిల్లర్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 20 శాతం 15 రోజుల్లో రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్తవారు రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వారం పాటు సమయం ఇవ్వగా జిల్లా వ్యాప్తంగా 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 15 రోజుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా ఇప్పటి వరకు 4 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుందో అధికారులు కచ్చితమైనా డేట్‌ను నిర్ణయించలేదు.
ఒకటి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 2.14 లక్షల కార్డులు
ప్రతి నెల 4367.538 మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు చౌకధరల దుకాణాల ద్వారా అందించిన దొడ్డు బియ్యాన్ని నిరుపేదలైన 20 శాతం జనాలు మాత్రమే తినగా 80 శాతం మంది జనాలు వాటిని విక్రయించారు. రేషన్ బియ్యం ఇచ్చారని తెలియగానే టాటా ఏసీ వాహనాల ద్వారా పలువురు వ్యాపారులు గ్రామాల్లో గద్దల్లా వాలిపోయి ఇండ్లు తిరుగుతూ కిలోకు రూ.15 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆ బియ్యాన్ని రైస్‌మిల్లర్స్ వారి దగ్గర కొనుగోలు చేసి వాటినే తిరిగి ప్రభుత్వానికి (ఎఫ్‌సీఐ)కి అప్పగించే వారు. ఇలా రొటీన్ పద్ధతిలో పీడీఎస్ రైస్ తిరిగేవి. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ కాబోతుండటంతో వాటిని బయట విక్రయించకుండా ప్రతి కుటుంబం ఇక నుంచి సన్న బియ్యాన్ని తిననున్నారు.