
కూలీలందరికీ ఉపాధి: జెడ్పీ సీఈఓ
● పని చేసే చోట వసతులు కల్పించాలి
● తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు
రేగోడ్(మెదక్): ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలందరికీ పని కల్పిస్తామని మెదక్ జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. రేగోడ్ మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ గృహాన్ని పరిశీలించి, ఉపాధిహామీ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ఉపాధిహామీ ద్వారా అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నామని, పని చేసిన వెంటనే కూలీ డబ్బులు చెల్లిస్తున్నామని తెలిపారు. కూలీలు పని చేస్తున్న ప్రాంతంలో వసతులు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా మండలాల్లోని వార్డుల వారీగా సరఫరా సమస్యలను తెలుసుకొని ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీప్యూటీ సీఈఓ రంగాచారి, ఎంపీడీఓ సీతారావమ్మ, సూపరింటెండెంట్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.