వయసుపైబడ్డాక ఏం చేస్తారు? ఆ.. ఏముంది, కృష్ణారామా అంటూ ఓ మూలన కూర్చోవడమే అనుకుంటారు చాలామంది! కానీ ఇక్కడ చెప్పుకునే ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాత్రం ఇప్పటికీ యాక్టివ్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, తనకెంతో ఇష్టమైన భరతనాట్యంతో మరోసారి మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆవిడే వైజయంతిమాల. ఐదేళ్లకే క్లాసికల్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందీవిడ. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా మారింది.
90 ఏళ్ల వయసులో నాట్యం..
వాస్‌కాయ్(జీవితం) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణించింది. సౌత్‌లో, బాలీవుడ్‌లో బడా స్టార్స్‌తో కలిసి యాక్ట్ చేసింది. కెరీర్‌లో ఉన్నతస్థానాన్ని చూసిన ఆమె ప్రస్తుత వయసు 90. ఇంత పెద్ద వయసులో అయోధ్యలో భరతనాట్య ప్రదర్శన చేసింది వైజయంతిమాల. అయోధ్యలో రామ్‌లల్లా రాగసేవ అనే కార్యక్రమం ప్రారంభించారు. జనవరి 27న మొదలైన ఈ ప్రోగ్రామ్ 45 రోజులపాటు కొనసాగనుంది.
ఇటీవలే పద్మవిభూషణ్..
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో వైజయంతిమాల భరతనాట్యంతో అందరినీ అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. టాలెంట్‌కు వయసుతో పని లేదని నిరూపించారు, మీరు నిజంగా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
నటి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
వైజయంతిమాల 1933 ఆగస్టు 13న జన్మించింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది 1949లో వాస్‌కాయ్ అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇదే మూవీ తెలుగులో జీవితం పేరిట రీమేకైంది. ఇందులోనూ వైజయంతిమాల కథానాయికగా నటించింది. హిందీలో బాహర్(1951) సినిమాతో గుర్తింపు పొందింది. నాగిన్‌తో స్టార్‌డమ్ అందుకుంది. దేవదాసు చిత్రంతో అవార్డులు ఎగరేసుకుపోయింది. సద్నా, మధుమతి, గంగ జమున, సూరజ్, చిత్రాలు ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల జాబితాలో నిలిచాయి. 1968లో కేంద్రప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది పద్మవిభూషణ్ వరించడం విశేషం.
Vyjayanthimala ji (at the age of 90😳) performing at Ramlala RaagSeva, Ayodhya! 🙏🏽pic.twitter.com/XQFCdrWbFS
— Keh Ke Peheno (@coolfunnytshirt) March 1, 2024
చదవండి: ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. స్టేజీపై తడబడ్డ స్టార్ సింగర్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment